అలాంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి: కౌశిక్ రెడ్డి పై గవర్నర్ పరోక్ష కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్ధి ప్రచారం చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల కమిషన్ ను కోరారు.జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ జేఎన్‌టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనను ఆమె ప్రస్తావించారు. తనకు ఓటు వేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్ధి ప్రచారం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎన్నికల కమిషన్ ను కోరారు. ఓటు అనేది ప్రధాన ఆయుధంగా ఆమె పేర్కొన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడికి గురి చేయవద్దన్నారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే అందరూ ఓటేయాలని గవర్నర్ కోరారు. పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని వసతులు కల్పించాలని గవర్నర్ కోరారు.
ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమేనన్నారు. కానీ ఈ సెలవు విహార యాత్రలకు వెళ్లేందుకు కాదని గవర్నర్ తెలిపారు.ఓటు వేయడం మనందరి బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దని గవర్నర్ చెప్పారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని గవర్నర్ చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్ లో ఉంటామన్నారు.ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కూడ లైన్ లో ఉండాలని గవర్నర్ ప్రజలను కోరారు.పోటీలో ఉన్న అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలని గవర్నర్ సూచించారు.
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవిష్కరించారు. కొత్తగా ఓటు హక్కును పొందిన అఖిల అనే యువతికి ఓటరు గుర్తింపు కార్డును అందించారు తమిళిసై సౌందరరాజన్.వివిధ పోటీల్లో విజేతలకు గవర్నర్ బహుమతులు అందించారు.
గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి తాను ఆత్మహత్య చేసుకొంటానని వ్యాఖ్యలు చేసినట్టుగా అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తమిళిసై సౌందరరాజన్ ప్రస్తావించారు.