ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గర: సీఎస్‌పై తమిళిసై ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గర అని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ శాంతికుమారిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫైరయ్యారు. ఢీల్లి కంటే రాజ్ భవన్ చాలా దగ్గర అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయమై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఈ నెల 2వ తేదీన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మరునాడు సీఎస్ పై గవర్నర్ ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్ భవన్ కు రాలేదని సీఎస్ ను ద్దేశించి వ్యాఖ్యానించారు. కనీసం మర్యాద కోసం ఫోన్ లో మాట్లాడని విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.
చర్చల వల్లే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇలాంటి పరిష్కారం మీకు అవసరం లేనట్టుగా కన్పిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. మరోసారి గుర్తు చేస్తున్నా ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గర అని ఆమె ట్వీట్ చేశారు.
తెలంగాణ గవర్నర్ తన వద్ద 10 బిల్లులు పెండింగ్ లో పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు మాసాలకు పైగా ఈ బిల్లులు గవర్నర్ వద్దే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే బిల్లుల విషయంలో అధ్యయనం చేస్తున్నట్టగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గతంలో ప్రకటించారు . ఉద్దేశ్యపూర్వకంగానే గవర్నర్ తన వద్ద బిల్లులను పెండింగ్ లో పెట్టారని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఈ 10 బిల్లులను ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ములుగులో ఫారెస్ట్ పరిశోధన సంస్థ,పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం,పురపాలక చట్టాలకు సవరణ,యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు కామన్ బోర్డు ఏర్పాటు,ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టసవరణ, జీహెచ్ఎంసీ, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం వంటి బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.యూనివర్శిటీల్లో నియామకాల విషయంలో కామన్ బోర్డు ఏర్పాటు అంశానికి సంబంధించి యూజీసీతో కూడా గవర్నర్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి 31వ తేదీన బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక సూచన చేసింది. ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులను మాట్లాడుకోవాలని హైకోర్టు కోరింది. లంచ్ బ్రేక్ సమయంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
గవర్నర్ పై విమర్శలు చేయవద్దని కూడా గవర్నర్ తరపు న్యాయవాది కోరారు. ఈ విషయమై ప్రభుత్వ న్యాయవాది ఒప్పుకున్నారు. ఈ రాజీ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. అదే రోజు సాయంత్రం బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రావాలని గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది.
also read:తమిళిసైపై సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్: 10 బిల్లులు ఆమోదం కోసం పిటిషన్
గత నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. దీంతో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరిందని అంతా భావించారు. కానీ పెండింగ్ బిల్లుల అంశం మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం అలానే ఉందని తేల్చి చెప్పింది.