వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి: గవర్నర్ తమిళిసై
వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు.
వరంగల్: నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారంనాడు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను గవర్నర్ అందించారు. వరద ప్రభావం గురించి గవర్నర్ స్థానికుల నుండి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు గవర్నర్ కు చెప్పారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయన్నారు. వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.జవహర్ నగర్ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయిందని గవర్నర్ చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్.
also read:వరంగల్‌కు గవర్నర్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న తమిళిసై
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జూలై మాసంలో భారీ వర్షాలు చోటు చేసుకున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వరదల నుండి ప్రజలు ఇంకా తేరుకోలేదు. వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లను విడుదల చేసింది.ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.