సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆమె కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ప్రాంగణంలో పొంగల్ వంటకాన్ని గవర్నర్ స్వయంగా తయారు చేశారు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల స్పూర్తిని చాటేలా కరోనా టీకా, ఆత్మ నిర్బర్ భారత్ సందేశాలతో కూడిన అందమైన గాలిపటాలను గవర్నర్ ఉత్సాహంగా ఎగురవేశారు.

ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పతంగులపై సందేశాలు ఉన్నాయని చెప్పారు.