హైదరాబాద్: తెలంగాణలోని కాకతీయుల కాలంనాటి పురాతన ఆలయాన్ని సంరక్షించాలంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కోరారు. వరంగల్ జిల్లా ముప్పారం గ్రామంలోని పురాతన త్రికూట ఆలయాన్ని పునరుద్దరించాలని గవర్నర్ కోరారు.  

త్రికూట ఆలయ పైకప్పుపై రామాయణ గాధకు సంబంధించిన అందమైన కుడ్య చిత్రాలు చెక్కబడి వున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని... పురాతన కాలంనాటి అద్భుత శిల్ప సంపద నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇలాంటి అద్భుత కళా సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం వుందని... కాబట్టి సాంస్కృతిక శాఖ ఆ బాధ్యత తీసుకోవాలని గవర్నర్ సూచించారు. 

ఈ ఆలయం పునరుద్ధరణ పనులను సమన్వయం చేసుకోవాలని పురావస్తు శాఖకు సూచించాలని విదేశాంగ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌కు రాసిన లేఖలో గవర్నర్‌ అభ్యర్థించారు. ఆలయంలోని కళా సంపదను కాపాడేందుకు గవర్నర్ తమిళిసై తీసుకున్న చొరవపై ప్రశంసలు వస్తున్నాయి.