ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మద్దతు ఇచ్చారు. ప్రధాని మోడీని అంబేద్కర్‌తో పోల్చడంపై ఇళయరాజాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళిసై ఇళయరాజాకు సోషల్ మీడియాలో మద్దతు పలికారు.
హైదరాబాద్: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మద్దతు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో ఆయన పోల్చడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. చాలా మంది ఇళయరాజపై విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా ముఖ్యంగా తమిళనాడులో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోషల్ మీడియాలో అండగా నిలిచారు.
ఇళయరాజపై వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. విద్వేష రాజకీయాలకు బీజాలు వేస్తున్న వారు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇళయరాజపై విమర్శలు చేయడం సరైందేనా? అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీని అంబేద్కర్‌తో పోల్చిన తమిళనాడు, దేశం గర్వించదగ్గ ఇళయరాజను అగౌరవపరచడాన్ని అనుమతించవచ్చునా? అని ప్రశ్నించారు.
భావ ప్రకటనకూ పరిమితులు విధిస్తున్నారా? ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా ఉంటుందా? అంటూ అడిగారు. ఇళయరాజా తన ఆలోచనలను వెల్లడించే హక్కు కలిగి ఉన్నారనే విషయాన్ని గట్టిగా చెబుదాం అంటూ పేర్కొన్నారు. మేలుకోండి తమిళనాడు అంటూ హితవు పలికారు.
అంబేద్కర్ కలలను మోడీ సాకారం చేస్తారన్న ఇళయరాజా తన హృదయంలో నుంచి పలికిన మాటలను స్వాగతించాల్సిందేనని ట్వీట్ చేశారు. మేధో సంక్షోభం, కుట్రపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఒక గొప్ప కళాకారుడిపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ విమర్శల వెనుక ఉన్నవారు తమ ఆలోచనలను మరోసారి సమీక్షించుకోవాలని, వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఆలోచనలు తమిళ్ సెంటిమెంట్లను వ్యక్తపరుస్తున్నాయని వివరించారు.
కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ కూడా ఇళయరాజాకు అండగా ట్వీట్ చేశారు. ఇళయరాజా సార్ చేసిన నేరం ఏమిటి? అని ప్రశ్నించారు. డీఎంకే పార్టీ, దాని సంబంధ వాతావరణానికి ఇళయరాజా అభిప్రాయాలు నచ్చడం లేదా? అని అడిగారు. భారత రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను కల్పిస్తున్నదని, దాన్ని ఇళయరాజాకు వ్యతిరకించడం అంటే.. డీఎంకే దళిత, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని వెల్లడిస్తున్నదని వివరించారు.
ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా అంబేద్కర్ అండ్ మోడీ అనే పుస్తకానికి ముందుమాట రాశారు. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై అంబేద్కర్ గర్వించేవాడని, వారిద్దరిలోనూ సారూప్యత గల అంశాలు అనేకం ఉన్నాయని ఇళయరాజా పేర్కొన్నారు. వారిద్దరూ పీడన, పేదరికాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. యువతరం ఈ పుస్తకం చదవాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
