హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య అగ్గిరాజేస్తోంది హుజుర్‌నగర్ ఉప ఎన్నిక. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అవధికార టీఆర్ఎస్ పార్టీ, హుజూర్ నగరలో మళ్లీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని హెచ్చరించారు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లే అనిపిస్తోందన్నారు. కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో ఎలా చెల్లుతుందంటూ ఘాటుగా విమర్శించారు. 

ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. నిజాయితీని నమ్ముకున్నప్పుడే గెలుపు సాధ్యమవుతుంది అని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో సీనియారిటీ కాదని సిన్సియారిటీ ముఖ్యమన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను బచ్చా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీకూడా బచ్చాయేనా చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంటూ పదేపదే విమర్శలు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతిని పోటీకి నింపడం కుటుంబ పాలన కాదా అని నిలదీశారు. 

వెన్ను చూపి పారిపోయిన నాయకులను ప్రజలు నమ్మరని ఘాటుగా విమర్శించారు. వారిని ఉత్తర కుమారులు అంటారు. కనీసం మాటమీద కూడా నిలబడరని తిట్టిపోశారు. యుద్ధంలో నిలబడిన వారిని మాత్రమే ధీరుడు, వీరుడు అని అంటారని కర్నె ప్రభాకర్ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడు సవాల్ మీద నిలబడలేదని చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో గద్వాలలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ విసిరిన సవాల్ పై ఉత్తమ్ నిలబడలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. 

కేటీఆర్ ధీరుడు అని కర్నె ప్రభాకర్ కొనియాడారు. అటు కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారని కానీ మాటమీద నిలబడలేదన్నారు. అధికారంలోకి రాకపోతే సన్యాసం తీసకుంటానన్న ఉత్తమ్ మాట తప్పాడని విమర్శించారు. 

కోదాడలో ఆయన భార్య ఓడిపోగానే హుజూర్ నగర్ లో పోటీకి పెడుతున్నాడని తిట్టి పోశారు. ఈ ఎన్నికలు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వానికి ప్రాజెక్టులు అడ్డుకుంటున్న పార్టీకి మధ్య జరుగుతున్నాయని కర్నె ప్రభాకర్ తెలిపారు.