హైదరాబాద్: 111 జీవో అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు.జనసేన సోషల్ మీడియాతో పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఈ విషయమై మాట్లాడారు.

ఎఫ్‌టిఎల్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.  అర్బన్ ప్లానింగ్ లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను చక్కదిద్దాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పై ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు,వెళ్లిపోతారు. అయితే వారు వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలన్నారు. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 నాలాలు ఆక్రమించి కట్టేస్తుంటే మేం చూసుకొంటాములే అనే వదిలేస్తారు. వాటిపై నిర్మాణాలు వస్తే భారీ వర్షాలు, వరదలతో ఎన్నో ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వాటర్ బాడీస్ ను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారన్నారు.
 నిబంధనల ఉల్లంఘనపై ప్రతిపక్షంలో ఉన్నపుడే బలంగా మాట్లాడతారని చెప్పారు.

 నదులు, చెరువులు, కుంటలను  ఆక్రమించి అమ్మేశారు. ఇలా నదులు, చెరువులు అమ్మేసిన విధానాన్ని నిలువరించి అక్రమ కట్టడాలు తీసేస్తే చాలా బాగుండేదన్నారు

 నాలాలు, చెరువుల దురాక్రమణపై ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాట్లాడినంత బలంగా అధికార పక్షంలోకి రాగానే మాట్లాడలేకపోతున్నారు. సన్నాయినొక్కులు నొక్కుతారన్నారు.

గతంలో హైదరాబాద్ నగరంలో 700 నుంచి 800 వరకూ చెరువులు ఉండేవని చెబుతారు. ఇప్పుడు 180 మాత్రమే ఉన్నాయి. అవి కూడా సైజు తగ్గిపోయి, కాలుష్యంతో దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆయన ఆరోపించారు. 

గండిపేట చెరువు కూడా సైజ్ తగ్గిపోయింది. కాలుష్యంపై నిర్లక్ష్యంగా ఉంటూ పొల్యూషన్ యాక్టులను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు.

జీవో 111 తీసుకువచ్చిందే వాటర్ బాడీస్ ను పరిరక్షించేందుకే. పరీవాహక ప్రాంతాల నుంచి జల ప్రవాహం ఆగకూడదనే ఉద్దేశంతో ఆ ఉత్తర్వు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దీనికి 2009 నుంచి తూట్లు పొడవాలని చాలా ప్రయత్నాలు  చేస్తున్నారు. నాలాలూ... ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న స్థలాలు ఆక్రమించేయడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం.. అనుమతులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.

also read:హైద్రాబాద్‌లో భారీ వర్షాలు:పాతబస్తీలో కేంద్ర బృందం పర్యటన

మళ్ళీ వాటిని కొంత డబ్బు కట్టించేసుకొని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. తప్పు చేసేయవచ్చు... ఆ తరవాత డబ్బు కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి అనే ధోరణే ఇప్పటి పరిస్థితికి దారి తీసిందన్నారు.

 టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి ఆ తప్పులను సరిచేసే బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎంత వరకూ సఫలీకృతులు అవుతారో తెలీదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది జీవో 111 అమలుపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు.

అధికారమే పరమావధిగా కాకుండా సామాజిక మార్పు పాలసీలపై బలంగా నిలబడాలనే ఆలోచన రాజకీయ పార్టీలలో ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

 అధికారంలో ఉంటే అన్ని సాధించవచ్చు అనుకోవడం భ్రమ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అధికారంలో లేని ఒక రాజకీయ పార్టీ. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులు కలిసి పోరాడాలని ఆయన సూచించారు.

ప్రతి ఒక్కరికి చట్టపరమైన నిబంధనలను సమానంగా వర్తించేలా చేయాలన్నారు.  అది 50 చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు. ముఖ్యంగా అధికారులు తమ నిర్ణయాలను భయపడకుండా బలంగా అమలు చేయాలని ఆయన కోరారు.