హైదరాబాద్:  నగరంలోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం నాడు పర్యటించింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, అల్ బజెల్ కాలనీ, ఘాజిమిల్లత్, బాబా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది.

కేంద్ర బృందానికి ప్రవీణ్ వశిష్ట నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో రఘురామ్, ఎస్ కె కుష్వారా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది.

రాష్ట్రంలో వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు పవర్ ప్రెజెంటేషన్ ను కేంద్ర బృందం చూసింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించింది.పాతబస్తీలో కేంద్ర బృందానికి హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి వరదల పరిస్థితి గురించి వివరించారు. 

also read:తెలంగాణకు చేరుకొన్న కేంద్ర బృందం: వరద నష్టంపై అంచనా

ఫలక్‌నుమా ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్ఓబిని, ముంపుకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది.  భారీ వర్షాలు, వరదలతో  తమ ఇళ్లలోకి నీరు వచ్చిన విషయాన్ని స్థానికులు  కేంద్ర బృందానికి వివరించారు.

నగరంలో దెబ్బతిన్న ప్రాంతాల వివరాల గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు.  పాతబస్తీలో తెగిన చెరువులు ఏ ఏ ప్రాంతాలను నీట ముంచాయో అధికారులు వివరించారు.