Asianet News TeluguAsianet News Telugu

బియ్యం దొంగలపై తెలంగాణ సర్కార్ సీరియస్

  •  ప్రభుత్వానికే రేషన్‌ బియ్యం అమ్ముతున్న వారి పట్టివేత
  • నిఘా పెట్టి ప్రత్యేక తనిఖీలతో వెలుగులోకి
  • వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు
  • బ్లాక్‌లిస్ట్‌లోకి రైస్‌ మిల్లులు
  • గోదాం ఇన్‌ఛార్జీపై వేటు
telangana government serious on subsidy rice thieves

బియ్యం దొంగలపై తెలంగాణ సర్కారు కన్నెర్రజేసింది. సబ్సిడీ బియ్యాన్ని దోపిడీ చేస్తున్నవారిపై వేటు వేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఈమేరకు పౌర సరఫరాల శాఖ వెలువరించిన ప్రెస్ నోట్ కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం.

నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ఒక్క రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యాన్ని స్వార్థపరులైన కొంతమంది మిల్లర్లు ఆ బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాలశాఖకే అమ్మిన వైనం వెలుగులోకి వచ్చింది. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌పై పౌరసరఫరాలశాఖ నిఘా బృందం ద్వారా సమాచారం అందుకున్న పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ శ్రీ సి.వి. ఆనంద్‌ నేరుగా రంగంలో దిగి తనదైనశైలిలో బియ్యం దొంగలను రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గోదాం ఇన్‌చార్జ్‌పై వేటు వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై  కమిషనర్‌ సివి ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇందుకు ప్రధానకారకులైన రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రదారులైన నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మిల్లులను బ్లాక్‌లిస్టులో పేట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మిల్లర్ల నుండి దొడ్డు బియ్యం (స్టేట్‌ పూల్‌ రైస్‌), సన్న బియ్యం కొనుగోలును నిలిపివేశారు.

రాష్ట్ర రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌కు తమ సభ్యులపై నిఘా లేకపోవడాన్ని కమిషనర్‌ గారు తీవ్రంగా పరిగణించారు. పేదల బియ్యాన్ని దిగమింగడానికి ప్రయత్నం చేస్తే సహించబోమని, అక్రమాలకు పాల్పడుతున్న రైస్‌ మిల్లర్ల మిల్లింగ్‌, తదితర ఛార్జీలు నిలిపివేస్తామని, అలాగే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులతో పాటు మిల్లులను సీజ్‌ చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ, మిల్లర్ల మధ్య ఒక నమ్మకం, సమన్వయంతో కలిసి పనిచేస్తూన్నప్పుడు, మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేయడం, మోసాలకు పాల్పడడం సహించరానిదని అన్నారు. ప్రజాపంపిణీ అవసరాల మేరకు ప్రభుత్వ దగ్గర సరిపడినన్ని బియ్యం నిల్వలు లేకపోవడంతో ప్రతి ఏటా మిల్లర్ల నుండి ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని, ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం పథకం కోసం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని మిల్లర్ల నుండి కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది టెండర్‌ ప్రక్రియ ద్వారా మిల్లర్ల నుండి కొనుగోలు చేసింది.

ఈ బియ్యం నాణ్యత విషయంలో కమిషనర్‌ శ్రీ ఆనంద్‌ నేతృత్వంలో గత కొద్దిరోజులుగా అత్యంత గోప్యంగా పౌరసరఫరాలశాఖ నిఘా బృందాలు, సాంకేతిక సిబ్బందితో గోదాములలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నాగర్‌కర్నూల్‌తో పాటు, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. సిరిసిల్లలో కొంతమంది రైస్‌ మిల్లర్‌లు నాణ్యతలేని సన్న బియ్యాన్ని అప్పగించిన విషయం బయట పడింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని సిడబ్ల్యుసి గోదాములో ఉన్నాయి. రెండు రోజుల క్రితం పౌరసరఫరాలశాఖ సాంకేతిక సిబ్బంది ఈ గోదాముల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలో రేషన్‌ బియ్యాన్ని రీసైక్లీంగ్‌ చేసి ప్రభుత్వానికి తిరిగి అమ్మిన విషయం బహిర్గతమైంది. 1080 (50 కేజీల) బస్తాలు రేషన్‌ బియ్యంగా గుర్తించారు. దీని విలువ 15 లక్షల రూపాయలకు వరకు ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీరాములుకు చెందిన శ్రీనివాసరైస్‌ మిల్‌, మల్లేష్‌కు చెందిన వెంకటేశ్వరరైస్‌ ఇండ్రస్టీస్‌ నుంచి రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా పకడ్బందీగా పథకం ప్రకారం ఒక్కో లారీ (ఎసికె)లో కొన్ని కొన్ని రీసైక్లింగ్‌ చేసిన బస్తాలను కలిపివేశారు. ఒక్కో లారీలో 400 నుండి 500 బ్యాగులు ఉంటాయి. ఈ బ్యాగుల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఎసికె నెం.131, 136, 137, 149, 163, 165లలో 1080 బస్తాల రీసైక్లీంగ్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని కలిపి వేశారు. ఈ రెండు రైస్‌ మిల్లుల యజమానులను కమిషనర్‌ తన కార్యాలయానికి పిలిపించగా హాజరు కాలేదు. అధికారులు ఈ రెండు రైస్‌ మిల్లులో కరెంట్‌ బిల్లుల తనిఖీలు చేయగా ధాన్యం మిల్లింగ్‌ చేయనట్లుగా గుర్తించారు. ఇంతకు ఈ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ నెల నుంచి ఈపాస్‌ విధానం అమల్లోకి రావడంతో రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో, అంతకు ముందు రేషన్‌ డీలర్ల నుండి బియ్యాన్ని కొనుగోలు చేసి, మిల్లర్‌లు నిల్వ ఉంచారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అప్పగించినట్లుగా అధికారులు గుర్తించారు.

సిరిసిల్లలో సన్న బియ్యం రీప్లేస్‌కు ఆదేశం

సన్న బియ్యం నాణ్యతపై కమిషనర్‌ గారి ఆదేశాల మేరకు సాంకేతిక సిబ్బంది తనిఖీలు చేపట్టగా   సిరిసిల్ల జిల్లాలో నాణ్యత లేని సన్నబియ్యాన్ని అప్పగిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% మించి బ్రొకెన్‌ రైస్‌ ఉండకూడదు. కాని ఇక్కడ 35% వరకు ఉంది. ఈ విధంగా 11 వేల బస్తాలలో 35% మేరకు బ్రొకెన్‌ రైస్‌ ఉందని గుర్తించారు. ఈ బియ్యాన్ని సరఫరా చేసిన మిల్లర్‌లను కమిషనర్‌ పిలిపించి గట్టిగా మందలించారు. మరోసారి పునరావృతం అయితే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. ప్రమాణాల ప్రకారం 11 వేల బియ్యం బస్తాల స్థానంలో నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇవ్వాలని (రీప్లేస్‌ చేయాలని) ఆదేశించారు. ఇకపై మిల్లర్‌లు ఎలాంటి అవతవకలకు పాల్పడినా ఏమాత్రం ఉపేక్షించేది లేదనీ, చర్యలు కఠినంగా ఉంటాయనీ కమిషనర్‌ తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం నిల్వలు ఉన్న   సిడబ్ల్యుసి, ఎస్‌డబ్ల్యుసి తదితర అన్ని గోదాముల్లో ప్రత్యేక తనిఖీలను కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా పిడి చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios