తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పెద్ద దుమారం రేపారు. సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన హెడ్ ఫోన్ ను గవర్నర్ వైపు విసిరికొట్టారు. అయితే ఆ సమయంలో ఆ హెడ్ ఫోన్స్ గవర్నర్ కు కాకుండా శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటి సమీపంలో తగిలాయి. దీంతో స్వామి గౌడ్ కు గాయం కాగా సరోజిని కంటి దవాఖానాకు తరలించారు.

ఈ ఘటనపై తెలంగాణ సర్కారు అగ్గి మీద గుగ్గిలమైంది. గవర్నర్ మీదే హెడ్ పోన్లు విసరడాన్ని సీరియస్ గా తీసుకున్నది సర్కారు. వీలైనత త్వరలోనే కోమటిరెడ్డి మీద వేటు వేసేందుకు సర్కారు చర్యలకు దిగింది. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత ఏరకమైన చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కోమటిరెడ్డి వైఖరిని మంత్రి హరీష్ ఖండించారు.

మరోవైపు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభా సలహా సంఘం (బిఎసి) సమావేశమైంది. కోమటిరెడ్డి వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ సమావేశంలో చర్చించకపోతే ప్రత్యేక విచారణ సంఘం ఏర్పాటు చేసి విచారించి చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. శాసనభలో తన ప్రవర్తనను కోమటిరెడ్డి సమర్థించుకున్నారు. తాను గవర్నర్ ను టార్గెట్ చేసి హెడ్ ఫోన్ విసిరితే పొరపాటున ఛైర్మన్ కు తగిలిందన్నారు. అయితే ప్రభుత్వం రైతులను నాలుగేళ్లయినా పట్టించుకోకపోవడంతోనే తాను సంయమనం కోల్పోయానన్నారు.

కోమటిరెడ్డిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి ఛైర్మన్ కంటికి గాయమైంది కాబట్టి కచ్చితంగా కోమటిరెడ్డిని మిగిలిన ఏడాది కాలానికి సస్పెండ చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ సభ్యులు కచ్చితంగా కోమటిరెడ్డిని సభనుంచి మిగతా కాలం మొత్తం సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. అయితే కోమటిరెడ్డిని ఈ సెషన్ వరకే సస్పెండ్ చేస్తారా? లేక తదుపరి కాలానికి మొత్తాన్ని సస్పెండ్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.