Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీఏ ప్రతిపాదిత కొత్త విద్యుత్ చట్టం: వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంగళవారం నాడు ఈ ప్రతిపాదిత చట్టాన్ని అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

Telangana Government resolution against NDA's new power bill
Author
Hyderabad, First Published Sep 15, 2020, 1:57 PM IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంగళవారం నాడు ఈ ప్రతిపాదిత చట్టాన్ని అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. 

పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టం కానుంది. ఈ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సహా పలు పార్టీల సభ్యులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే  రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చట్టమని ఆయన అభిప్రాయపడ్డారు.కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లన్నీ కేంద్రం దగ్గరకు వెళ్తాయన్నారు. కొత్త విద్యుత్ చట్టం వస్తే క్రాస్ సబ్సిడీ, ఈఆర్సీలు ఉండవని కేసీఆర్ చెప్పారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదంలో తాము చనిపోతామని తెలిసి కూడ విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని సీఎం కొనియాడారు. ప్రజల ఆస్తులను కాపాడడానికి అధికారులు త్యాగం చేశారని ఆయన చెప్పారు.

దేశంలో 2 లక్షల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉన్నా వాడడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడ కొన్ని కేంద్రీకృతం చేశారని ఆయన ఆరోపించారు. 
కొత్త చట్టంతో అసలుకే ఎసరు పెడుతున్నారని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ప్రైవేట్ వాళ్లు అడిగినా కూడ ఇవ్వలేదన్నారు. 

ప్రభుత్వ సంస్థలకు ఆదాయం వస్తే ఇక్కడే అభివృద్ధి చేస్తాయని సీఎం చెప్పారు.విద్యుత్ సరఫరాలో మన రాష్ట్రమే టాప్ అని సీఎం చెప్పారు.విద్యుత్ వినియోగంలోకి తేవడానికి కేంద్రం సహాయం చేయాల్సింది పోయి కొత్త చట్టంతో అసలుకే ఎసరు తెస్తున్నారని ఆయన చెప్పారు.బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, విమానయానరంగాన్ని కేంద్రం చంపేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios