ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరణి పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

నవంబర్‌ 2 నుంచి ప్రారంభమైన ధరణి పోర్టల్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 89,851 లావాదేవీలు జరగగా.. 66,614 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 1.35 కోట్ల మంది ధరణి పోర్టల్‌ వెబ్‌సైట్‌ని సందర్శించినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.  

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి పోర్టల్‌పై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. స్లాట్స్‌ బుకింగ్‌‌లు కూడా నిలపాలని ఆదేశించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఇకపై సోమవారం నుంచి కార్డ్‌ పద్ధతిలోనే (సీఏఆర్డీ) రిజిస్ట్రేషన్లు జరపనున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది