అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలపైనే కాదు ప్రభుత్వ ఉద్యోగులపైనా సీఎం కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సాంస్కృతిక సారథులకు కూడా 30శాతం పీఆర్సీ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులు ప్రస్తుతం రూ.24514 జీతం అందుకుంటుండగా పెరగిన పీఆర్సితో వారి జీతం 31,868కి పెరగనుంది. అంటే ఒక్కో ఉద్యోగికి రూ. 7300 ల మేరకు జీత భత్యాలు పెరగనున్నాయి.

పీఆర్సీ 2020 ప్రకారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు 30శాతం పెంపు 2021 జూన్ 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఈ పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశించింది. మూడు నెలల క్రితమే టిఎస్ఎస్ ఉద్యోగుల పిఆర్సీ అమలుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ ఆమోదంతో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

Read More సాయిచంద్ భార్య రజినికి ఆర్ధిక సహాయం: రూ.కోటి చెక్ అందించిన సబితా

పిఆర్సీ అమలు ఉత్తర్వులు వెలువడటంతో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులు సీఎం కేసీఆర్, చైర్మన్ రసమయి బాలకిషన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇకపై తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేసే 583 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందనున్నారు.