హైదరాబాద్: పోతిరెడ్డిపాడు  ప్రవాహా సామర్థ్యం పెంపు(రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 5వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించనుంది.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్ లు, గోదావరి నీటి వాటాల కేటాయింపు, కేఆర్ఎంబీ కార్యాలయం విజయవాడకు తరలింపు, అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ హాజరు కానున్నారు. 

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లకు నోటిఫికేషన్ ను కూడ జారీ చేసింది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లో కనీసం మంచినీటి ప్రాజెక్టులకు కూడ నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మానంపై మండిపడుతోంది.  

ఈ విషయమై ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరో వైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తనుంది. 

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుకూలంగా చేసిన ప్రసంగాలను, ఎన్నికల మేనిఫెస్టోలను కూడ కేసీఆర్ ప్రస్తావించారు.

కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి పెన్నా పరివాహక ప్రాంతంలోకి నీటిని తరలించడం ఇరిగేషన్ నిబంధనలకు విరుద్దమని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ వాదనలను తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించనుంది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చంద్రబాబును ఇరుకున పెట్టిన విధంగా జగన్ ను కూడ కేసీఆర్ ఇరుకున పెడతారా ఇతర ప్లాన్ ను అమలు చేస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:వెనక్కి తగ్గని జగన్: పోతిరెడ్డిపాడు టెండర్లకు నోటిఫికేషన్ జారీ

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఈ నెల  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.