అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం( పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్థ్యం పెంపు) పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకే సాగుతోంది. ఈ ప్రాజెక్టు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. ఈ విషయమై కృష్ణా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఈ విషయమై చర్చ జరగనుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:పోతిరెడ్డిపాడు విస్తరణ: ఏపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పాలమూరు రైతుల పిటిషన్

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఈ నెల  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.

అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేష్ స్కీమ్ చేపడితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు ఏడారిగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ మహబూబ్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.