తెలంగాణ నిరుద్యోగులకు మరో తీపి కబురు. ఉద్యోగాల కోసం  ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సుమారు 2వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం సచివాలయం సాక్షిగా కసరత్తు జరుగుతోంది. దీనిపై క్లారిటీ రాగానే నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. పంచాయతీ రాజ్ శాఖలో కీలకమైన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ 2వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రికి వివరించారు. గ్రామ పరిపాలనలో కీలకమైన పోస్టులు పంచాయతీ కార్యదర్శులు కాబట్టి తక్షణమే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని మంత్రి సూచించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి కార్యదర్శుల వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరముందన్నారు మంత్రి జూపల్లి.

దాదాపు రెండువేల వరకు పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరితగతిన భర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఖాళీల భర్తీపై అధికారులు కసరత్తు షురూ చేశారు. పూర్తి సమాచారం సేకరించి మంత్రికి నివేదిక అందించనున్నారు అధికారులు. సీనీయారిటీ ప్రాతిపదికన కార్యదర్శుల పదోన్నతులు చేపట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.