విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధనం కోసం నిధులు ఇచ్చి నిబంధల మేరకు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇటీవల ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ-ఆసక్తి వ్యక్తీకరణను)ను ఆహ్వానించింది. 

హైదరాబాద్‌: విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధనం కోసం నిధులు ఇచ్చి నిబంధల మేరకు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇటీవల ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ-ఆసక్తి వ్యక్తీకరణను)ను ఆహ్వానించింది. ఈవోఐ సమర్పణకు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా నిర్ణయించింది. అయితే ఈ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి లేదా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో 51 శాతం వాటాను కలిగి ఉండటం ద్వారా విస్తృతంగా నిర్ణయాధికారాలను కలిగి ఉంది. ఇందులో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. బిడ్‌లలో పాల్గొనే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి బ్లూప్రింట్‌ను రూపొందించాలని రాష్ట్ర, సింగరేణి అధికారులతో కూడిన బృందాన్ని ముఖ్యమంత్రి కెకేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు విశాఖకు వెళ్లనున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వ్యక్తం చేయడంతో పాటుగా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటవీల విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు.. స్టీల్ ప్లాంట్‌పై సమాచారాన్ని క్రోడీకరించి.. బిడ్‌లలో పాల్గొనడం ద్వారా ప్రైవేటీకరణను అడ్డుకునే మార్గాలపై వారి సూచనలను కేసీఆర్‌కు పంపినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకుని అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూడా పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. అలాగే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తన వాయిస్‌ను బలంగా వినిపిస్తోంది. 

మార్చి 27న కేంద్ర ప్రభుత్వం మూలధన సేకరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలు, ఉక్కు తయారీదారుల నుండి ఈవోఐలను ఆహ్వానించింది. అయితే.. ఈ ఈవోఐని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే దిశగా మొదటి అడుగుగా బీఆర్ఎస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో పాల్గొనడం ద్వారా.. పీఎస్‌యూల ప్రైవేటీకరణ, బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు దేశవ్యాప్తంగా స్పష్టమైన సందేశాన్ని అందించాలనే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తుంది.