హైదరాబాద్:ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి  ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆర్ధిక సహాయం అందించాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్స్  శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని పలు ప్రైవేట్ సంస్థల్లో 1.45 లక్షల మంది పనిచేస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది.  వారికి సహాయం కోసం  నెలకు రూ. 42 కోట్లు అవసరమౌతాయని అధికారులు మంత్రులకు తెలిపారు.కరోనా నేపథ్యంలో గత ఏడాది నుండి విద్యా సంస్థలు మూతపడ్డాయి. గత ఏడాది మార్చి నుండి విద్యాసంస్థలు మూసివేశారు. ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుండి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఆర్ధిక ఇబ్బందులతో పడుతున్నారు.

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న రవి ఆర్ధిక ఇబ్బందులతో మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొన్నాడు.  రవి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత రెండు రోజులకు ఆయన భార్య అక్కమ్మ కూడ  ఆత్మహత్య చేసుకొంది.

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు తెరిచే వరకు రూ. 2000 ఆర్ధిక సహాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున  బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని  సీఎం నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం మేరకు  ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఈ నెల నుండే  ఆర్ధిక సహాయం అందించాలని  మంత్రులు అధికారులను ఆదేశించారు.