హైదరాబాద్: దీపావళిని పురస్కరించుకొని బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వైరస్ నేపథ్యంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఈ నెల 12వ తేదీన ఆదేశించింది.ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం బాణసంచాను  నిషేధించింది.

also read:దీపావళి బాణసంచా కాల్చడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తక్షణమే టపాసుల దుకాణాలను మూసివేయాలని కోరింది. ఇతర రాష్ట్రాల్లో బాణసంచా క్రయ విక్రయాలతో పాటు  కాల్చడంపై కూడ నిషేధం ఉన్న విషయాన్ని నిన్న హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది.ఈ విచారణలో బాణసంచా క్రయ విక్రయాలతో పాటు  కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకుండా క్రయ విక్రయాలు జరిపేవారితో పాటు బాణసంచా కాల్చేవారిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఆదేశాలను అనుసరించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బాణసంచాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.