హైదరాబాద్: మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులకు సంబంధించిన ఫైల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇప్పటికే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించింది. 

గర్భం సమయంలో 180 రోజులు సెలవులు తీసుకునేలా ఆదేశించింది. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ఇస్తారు. ఈ సెలవులనే డ్యూటీగా పరిగణించి సర్వీస్ ను కొనసాగిస్తారు. మహిళా ఉద్యోగి గర్భిణీ అయిన 8వ నెల నుంచి ఎప్పుడైనా 180 రోజుల సెలవులు ఉపయోగించుకోవచ్చు. 

అయితే ఈ ప్రసూతి సెలవులు మొదటి, రెండో కాన్పులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకటి, రెండు కాన్పుల్లో పిల్లలు చనిపోతే మూడో కాన్పులో సెలవులకు అవకాశం ఇస్తారు.
కాన్పునకు ముందుగాని, తరువాత గాని ఉద్యోగికి ఉండే అర్హత సెలవులు ఉపయోగించుకోవచ్చు.