హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 43,462 జీవోలు అదృశ్యం కావడంపై హైకోర్టు  బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది.

ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి  నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు చీప్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో ప్రభుత్వం స్పందించాలని నోటీసులు ఇచ్చింది.

హైద్రాబాద్‌ ఎల్బీనగర్ కు చెందిన పేరాల శేఖర్ రావు జీవోలు మాయం కావడంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అదృశ్యమైన జీవోలను తిరిగి ప్రభుత్వ జీవోల పోర్టల్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆ పిల్‌లో ప్రభుత్వాన్ని కోరారు.

జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 17,061 జీవోలు జారీ చస్తే 9,053 జీవోలు కన్పించకుండా పోయాయి. హోం శాఖలో 7945 లో జీవోలు జారీ చేస్తే  5371 జీవోలు అదృశ్యమయ్యాయి.

ఆర్ధిక శాఖలో 11,995 జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే 5150 జీవోలు పోర్టల్‌లో లేవు. పంచాయితీరాజ్,రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో 4071 జీవోలు జారీ చేస్తేత 2249 జీవోలు లేకుండా పోయాయి.

2014 జూన్ రెండో తేదీ నుండి 2019 ఆగష్టు 15 వ తేదీ మధ్య  సుమారు 1.04 లక్షల జీవోలు జారీ అయ్యాయి. ఈ జీవోల్లో 43,462 జీవోలు కన్పించకుండా పోయాయని ఆ పిల్ లో పిటిషనర్ పేరాల శేఖర్ రావు పేర్కొన్నాడు.సర్క్యులర్ జీవోలను ప్రభుత్వజీవోల వెబ్‌సైట్‌లో పొందుపర్చడం లేదని తాను గుర్తించినట్టుగా ఆయన ఆ పిటిషన్‌లో ప్రస్తావించాడు.

సెల్‌ఫోన్ బిల్లుల చెల్లింపులతో పాటు వాటర్ క్యాన్ల కోసం ఖర్చు  చేసిన డబ్బుల విషయాన్నికి సంబంధించిన జీవోలను అప్‌లోడ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.కానీ, ముఖ్యమైన సమాచారం కోసం సంబంధించిన జీవోలను మాత్రం అప్‌లోడ్ చేయడం లేదని ఆయన  చెప్పారు.

2014 జూలై 9వ తేదీన జీవో నెంబర్ 15 విడుదల చేశారు. ఈ జీవోలో రూ. 128లు  ఫోన్ బిల్లు చెల్లించేందుకు నిధుల విడుదల చేసిన జీవో. ఇదే తరహలో 743 జీవో ద్వారా  రూ.359 లను బిఎస్ఎన్‌ఎల్ బిల్లు చెల్లించినట్టుగా పేర్కొన్నారు.