తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన పిఎం, డ్రైవర్, గన్ మన్ లకు కూడా కరోనా సోకింది.
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శాసనసభ్యులను కూడా కరోనా వైరస్ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
తనకు కరోనా వైరస్ సోకడంతో కడియం శ్రీహరి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కడియయం శ్రీహరి డ్రైవర్, పిఎ, గన్ మన్ లకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కరోనా బారిన పడ్డారు. చికిత్స పొంది ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇదిలావుంటే, మంగళవారంనాటి లెక్కల ప్రకారం.... తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం కొత్తగా 1,430 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,705కి చేరింది. ఇవాళ వైరస్‌తో ఏడుగురు మరణించడంతో మృతుల సంఖ్య 429కి చేరుకుంది.
ఒక్క హైదరాబాద్‌లోనే 703 మందికి పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డి 117, మేడ్చల్‌లలో 105 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 16,855 మందికి కరోనా టెస్టులు చేయడంతో వీటి సంఖ్య 2 లక్షల 93 వేల 77 మందికి పరీక్షలు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,891 యాక్టివ్ కేసులు ఉండగా.. 36,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.