రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ నేత స్వామి గౌడ్: ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. బైక్ అదుపు తప్పడంతో స్వామి గౌడ్ కు గాయాలయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి మాజీ చైర్ పర్సన్ , బీజేపీ నేత స్వామి గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడడంతో స్వామి గౌడ్ కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్ వద్ద శనివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి గౌడ్ గాయపడ్డారు. స్వామి గౌడ్ నడుపుతున్న టూ వీలర్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. బండ్లగూడ నుండి కిస్మత్ పూర్ లోని తన నివాసానికి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసకుంది. బండ్లగూడ వద్ద రోడ్డుపై బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే బైక్ నుండి కింద పడడంతో స్వామి గౌడ్ కు కాలు విరిగినట్టుగా సమాచారం. వైద్యులు స్వామి గౌడ్ కు చికిత్స అందిస్తున్నారు.
2020 నవంబర్ 25 వ తేదీన స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న స్వామిగౌడ్ కీలకంగా వ్యవహరించారు. సకల జనుల సమ్మె విజయవంతం కావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది. అయితే ఈ సమ్మె విజయవంతం కావడంలో స్వామి గౌడ్ కీలకంగా వ్యవహరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ శాసనసమండలి చైర్ పర్సన్ గా స్వామి గౌడ్ కొనసాగారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుండి స్వామి గౌడ్ పోటీ చేయాలని భావించారు. అయితే ఈ స్థానం నుండి టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టీఆర్ఎస్ నాయకత్వం ఈ స్థానం నుండి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుండి టీార్ఎస్ లో చేరిన ప్రకాష్ గౌడ్ కు టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలో అవకాశం ఇవ్వకపోతే చేవేళ్ల ఎంపీ స్థానం నుండి కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ స్వామిగౌడ్ కు కేటాయించలేదు. దీంతో ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వామి గౌడ్ బీజేపీలో చేరారు.
also read:బండి సంజయ్ పాదయాత్ర: కేసీఆర్ మీద స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు స్వామి గౌడ్ తో చర్చలు జరిపారు. అయితే బీజేపీలో చేరారు స్వామి గౌడ్., బీజేపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి టీఆర్ఎస్ కు దూరంగా ఉన్న నేతలపై బీజేపీ కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే స్వామిగౌడ్ ను బీజేపీలో చేర్చుకొంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై బీజేపీలో చేర్చేలా పావులు కదుపుతున్నారు. ఈ నెల 21న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు ఇటీవలనే చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు.