Asianet News TeluguAsianet News Telugu

నోటిఫికేషన్ల జారీలో ఆలస్యమెందుకు?.. మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి 

ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నియామక సంస్థలను ఆదేశించారు.

Telangana Finance Minister T Harish Rao holds review meet on jobs recruitment
Author
First Published Aug 27, 2022, 3:52 AM IST

ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నియామక సంస్థలను ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌పై శుక్ర‌వారం ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, నియామక సంస్థలైన టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, గురుకుల నియామకాల బోర్డులతో పాటు నియామకాలకు సంబంధించిన శాఖలతో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. 

ఉద్యోగ నియామ‌కాల‌పై ఆర్థిక శాఖ రూపొందించిన నివేదిక‌ ఆధారంగా మంత్రి హ‌రీష్ రావు సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా  ఉద్యోగాలు, వెలువడిన నోటిఫికేష‌న్ల వివరాల‌ను నిశితంగా పరిశీలించారు.  ఈ త‌రుణంలో కొన్నింటికి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమతులు ఇచ్చినా.. నోటిఫికేష‌న్స్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌ని సూచించారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను మ‌రింత‌ వేగ‌వంతం చేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. దాదాపు 80 వేల ఉద్యోగ ఖాళీలను నోటి ఫై చేసిన ప్రభుత్వం ఇప్పటికే సగానికిపైగా కొలువులను భర్తీ చేసేందుకు అనుమతులు సైతం ఇచ్చిందని తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తయి నెలలు గ‌డుస్తున్నా..  కేవలం పోలీసు, ఇంజనీరింగ్‌ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయంటూ.. ఇతర ఉద్యోగాల నోటిఫికేష‌న్ ల‌ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వ‌ర‌లోనే  ఇత‌ర నోటిఫికేష‌న్లను జారీ చేయాల‌ని మంత్రి సూచించారు. గ్రూప్ 3, గ్రూప్ 4 నియామ‌కాల నోటిఫికేష‌న్లు త్వ‌ర‌గా ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌తో పాటు ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌రించిన విషయాన్ని గుర్తు చేశారు.  

వీలైనంత త్వరగా ఉద్యోగ  ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయాలని సూచించారు. అన్ని రకాల అంశాలను పరిశీలించుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలని, అవ‌స‌ర‌మైతే.. సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించిన‌ సవరణలు చేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌త్యేకంగా ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలు వీలైనంత త్వరగా అందించాలని సంబంధిత అధికారులను హరీశ్‌రావు ఆదేశించినట్లు తెలుస్తుంది.

అదే స‌మయంలో గురుకుల ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌కు అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికీ జాప్యం జరగడంపై సంబంధిత అధికారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన జోనల్ వ్య‌వ‌స్థ‌లో ఏమైనా స‌మ‌స్య‌లు, సందేహాలుంటే ప్రభుత్వానికి నివేదించాల‌ని మంత్రి హ‌రీశ్ రావు సూచించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios