40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఆర్ధికమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన రూ. 2,800 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఏప్రిల్, మే నెలకు సంబంధించిన జీఎస్టీ పరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం తెలంగాణయేనన్నారు. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.

2017-18, 2018-19, 2019-20 సంవత్సరాల్లో చక్కని వృద్ధిని సాధించిందని హరీశ్ రావు తెలిపారు. కోవిడ్ కారణంగా ఏప్రిల్, మే నెలలో జీఎస్టీని భారీగా కోల్పోయామని హరీశ్ వెల్లడించారు.

Also Read:గుడ్‌న్యూస్: 'జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు'

ఈ ప్రభావం రాష్ట్రంలోని అన్ని రంగాలపై పడిందని, ఆదాయం పడిపోవడంతో ప్రభుత్వోద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఏర్పడిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారుతున్నాయని హరీశ్ మండిపడ్డారు . 

కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ గడువును ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. కరోనా నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వీడియో కాన్పరెన్స్ ద్వారా నిర్వహించారు.

ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మే, జూన్, జూలై మాసాలకు జీఎస్టీఆర్-3 బీ ఫామ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్ లోపుగా దాఖలు చేసుకోవచ్చని కౌన్సిల్ తెలిపింది. దీంతో రూ. 5 కోట్ల టర్నోవర్ లోపు వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఊరట లభించనుంది. 

ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ వసూలు చేయబోమని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక జూలై 6 వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులపై అపరాధ వడ్డీ కూడ ఉండదని కేంద్రం తెలిపింది.

ఆ తర్వాత జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసే చిరు పన్ను చెల్లింపు దారులపై వడ్డీ రేటును తొమ్మిది శాతానికి తగ్గించనట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు వర్తిస్తోందని మంత్రి తెలిపారు. 

Also Read:భారత్ లో కరోనా.. 24గంటల్లో పదివేలు దాటిన కేసులు, 396 మరణాలు

2017 జూలూ నుండి 2020 జనవరి వరకు నెలవారీ జీఎస్టీ అమ్మకాల రిటర్న్స్ దాఖలు చేయని వారికి అత్యధికంగా రూ. 500 జరిమానాను విధించాలని నిర్ణయించినట్టుగా నిర్మలా సీతారామన్ తెలిపారు.

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపుపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి తెలిపారు. జీఎస్టీ అమలు చేయడంతో రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయి. అయితే ఈ కోల్పోయిన ఆదాయంలో తాము భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే కేంద్రం మాత్రం ఈ హామీని అమలు చేయడం లేదని ఆయా రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.

దీంతో జీఎస్టీ పరిహారం చెల్లింపుపై జూలై మాసంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాన్ మసాలపై తదుపరి కౌన్సిల్ సమావేశంలో కూడ చర్చిస్తామని కేంద్రం తెలిపింది.