హైదరాబాద్: తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన 1969లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనూ, ఇటీవలి మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 

కొల్లూరి చిరంజీవి కుటుంబ సభ్యులతో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడారు. డా. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.  డా. చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలను ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పించారు.

ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇదే రోజున తమ తండ్రి పుట్టినరోజు కావడం, ఇదే రోజున ఆపదలో ఉన్న తమను మంత్రి కేటీఆర్  ఆదుకోవడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు.

హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న చిరంజీిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరామర్శించారు. 1969 ఉద్యమంలో కొల్లూరి చిరంజీవి కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. కాకతీయ వైద్య విద్యార్థులను ఉద్యమంలో భాగం చేయడంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారని చెప్పారు మలి దశ ఉద్యమంలోనూ పాల్గొన్న చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.