జనగామ: తెలంగాణలో అవినీతికి సంబంధించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనగామ మండలం ఓబుల్ కేశపురంలో ఓ రైతు ధర్నాకు దిగడంతో ఆ సంఘటన తెలిసి వచ్చింది. తన భూమిని కొలిచేందుకు ఆర్డీవో కార్యాలయానికి చెందిన అధికారులు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతు జెన్నపల్లి కృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు. 

గత రెండు నెలలుగా తాను ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు ఆయన తెలిపాడు. లక్ష రూపాయల లంచం ఇవ్వాలని చేసిన అధికారులపైరైతు తిరుగుబాటు చేశాడు. ఆర్డీవో చర్యకు నిరసనగా కృష్ణా రెడ్డి ధర్నాకు దిగాడు. ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ప్లకార్డును ప్రదర్శించాడు. 

తన భూమిలో 15 గుంటలు తక్కువ వస్తోందని, భూమిని కొలిచి రికార్డులను సరిచేయాలని రైతు కోరుతున్నాడు. కృష్ణా రెడ్డికి 3 ఎకరాల భూమి ఉంది. ధర్నాలో రైతు పట్టుకున్న ప్లకార్డుపై లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు రాసి ఉండడం గమనార్హం. 

లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు రైతు చేసిన ఆరోపణను ఆర్డీవో మధుమోహన్ ఖండించారు. సర్వే చేయడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఎన్నికల హడావిడి వల్ల, ఇతర కార్యక్రమాల వల్ల ఆలస్యం జరిగినట్లు ఆయన తెలిపారు. రైతు సమస్యను పరిష్కరించే విషయాన్ని తానే స్వయంగా చూస్తానని ఆయన చెప్పారు. 

తాను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కృష్ణారెడ్డి ధర్నా విరమించినట్లు మధుమోహన్ చెప్పారు. 

 

"