Asianet News TeluguAsianet News Telugu

పోలవరంతో భద్రాచలానికి పెను ముప్పు... అధ్యయనం చేయించండి: ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ప్రాంతానికి పెను ముప్పు వాటిల్లితుందని తెలంగాణ ఈఎన్‌సీ.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు శనివారం లేఖ రాశారు. రక్షణ కట్టడాలు నిర్మించి, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు
 

telangana enc writes letter to polavaram project authority over back water issue
Author
Hyderabad, First Published Jul 30, 2022, 9:40 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో భద్రాచలం పరిధిలోని (bhadrachalam) పలు మండలాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి క్లౌడ్ బరెస్ట్ అని కేసీఆర్ అంటే.. కాదు పోలవరం (polavaram project) వల్లేనని కొందరు టీఆర్ఎస్ నేతలు (trs) వ్యాఖ్యానించడం దీనికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య వాతావరణం వేడెక్కింది. పోలవరం విలీన మండలాలను తెలంగాణలో కలపాలని పలువురు వాదిస్తున్నారు. దీనికి ఏపీ మంత్రులు, నేతలు ఘాటుగా కౌంటరిస్తున్నారు. 

తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ శనివారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కు (polavaram project authority) లేఖ రాశారు. ఏపీలో కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రచలానికి పెనుముప్పు ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఈఎన్సీ లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడే పరిస్ధితులు, ప్రభావాలపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని కూడా తెలంగాణ ఈఎన్సీ కోరారు. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీరు నిల్వ వుంటే భద్రాచలం ప్రాంతానికి ముప్పు మరింత పెరుగుతుందని.. మున్నేరువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని పేర్కొన్నారు. రక్షణ కట్టడాలు నిర్మించి, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇకపోతే... ఇటీవల పోలవరం బ్యాక్ వాటర్.. భద్రాచలం, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయని.. మొత్తంగా 90 గ్రామాలకు ఇది పెద్ద సమస్యగా మారుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. అందువల్ల గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ సహా.. పరిష్కారం కోసం అన్ని మార్గాల్లో పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అదే సమయంలో న్యాయపరమైన అవకాశాలను కూడా తెలంగాణ సర్కార్ అన్వేషిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించడానికి కేంద్రం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. 

Also REad:పోలవరం బ్యాక్ వాటర్‌తో పెను ముప్పు ఉందన్న తెలంగాణ.. 90 గ్రామాలకు సమస్యే.. పోరాడాలని నిర్ణయం..!

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంతోపాటు.. ఐటీసీ భద్రాచలం, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌లకు కూడా ముప్పు వాటిల్లుతుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఐటీసీ భద్రాచలం, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న అణుశక్తి విభాగం రెండూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశాయని అధికారులు తెలిపారు. వారి అభిప్రాయాలు, భయాలను నివృత్తి చేయాలని కోరిన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి  స్పందన లేదని చెప్పారు. 

అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సంబంధింత విభాగాల అనుమతులు తీసుకున్నందున తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. అయితే నీటి విస్తరణ ప్రాంతాలను గుర్తించకపోతే.. ప్రాజెక్టు వల్ల 90 గ్రామాలు ముప్పును ఎదుర్కొంటాయని ఆయన చెప్పారు. జీఆర్‌ఎంబీ సమావేశంతో పాటుగా.. పీపీఏ సమావేశాల్లో కూడా వారు సమస్యను లేవనెత్తారని.. అయితే పోలవరం నీటి ప్రభావిత ప్రాంతంపై జీఆర్ఎంబీ ఇంకా అధ్యయనానికి ఆదేశించలేదని రజత్ కుమార్ అన్నారు. 

వరదల సమయంలో అదనపు నీటిని మళ్లించడమే కాకుండా.. 450 టీఎంసీల స్టోరేజీతో ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలను తీర్చేందుకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును రూపొందించినట్లు ఇరిగేషన్ సీనియర్ అధికారులు తెలిపారు. దీని కోసం నీటి మళ్లింపును సులభతరం చేయడానికి ప్రాజెక్టును పూర్తి రిజర్వాయర్ స్థాయి పరిస్థితులను ఎక్కువ కాలం నిర్వహించవలసి ఉంటుందని చెప్పారు. ఇది భద్రాచలం, దుమ్ముగూడెం పట్టణాలతో పాటుగా పరిసర ప్రాంతాలు వరద ముప్పును నిరంతరం కలిగిస్తుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios