Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్.. కేసీఆర్ హర్షం

విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. 

Telangana electricity contract and outsourcing employees Regularisation
Author
Hyderabad, First Published Sep 18, 2018, 2:48 PM IST

హైదరాబాద్: విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో విద్యుత్ శాఖలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్., ఎన్.పి.డి.సి.ఎల్. సంస్థలలో పనిచేసే 23వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించడానికి మార్గం సుగమమైంది. 

విద్యుత్ సంస్థలలో ఎంతో కాలంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులను గతంలో ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై విచారణ కొనసాగించింది. 

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరుఫున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతీ దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపారు. 

మెరుగైన విద్యుత్ సరఫరాకోసం శ్రమిస్తున్న ఆర్టిజన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, వారికి ఉద్యోగ భద్రత లేదని కోర్టుకు వివరించారు. విద్యుత్ శాఖ వాదనలను విన్న హైకోర్టు వారి వాదనలను సమర్ధించింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రద్దు చేసింది. 


విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసును క్రమబద్దీకరించేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకుందని దాన్ని హైకోర్టు సమర్థించడం సంతోషకరమన్నారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఈరోజు పండుగ రోజని కేసీఆర్ అభివర్ణించారు. 

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారి జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుతో సిఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్ నిర్ణయించాలని, వారికి పి.ఆర్.సి.అమలు చేయాలని సిఎండిని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు హైకోర్టు తీర్పుపట్ల జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆర్టిజన్లు రెగ్యులర్ ఉద్యోగులేనన్నారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖకు ఇది ఎంతో శుభ దినమన్నారు. 

నేటి నుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులే అని సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారికి పే స్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సిఎండి ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్జిజన్లు రెగ్యులరైజ్ కావడం వల్ల పొందగలిగారని సంతృప్తి వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios