తెలంగాణ ఎలక్షన్స్ : కొబ్బరినీళ్లు పంచినా నేరమేనా??.. ఇవేం రూల్స్??
రోడ్డు మీద కొబ్బరినీళ్లు పంచుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు విచిత్రానుభవం ఎదురయ్యింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇలాంటి పనులు చేయద్దని పోలీసులు చెప్పడంతో అవాక్కయ్యింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే ఎక్కువగా తరలిస్తున్న నగదు, నగలు పట్టుకుంటున్నారు. సరైన ఆధారాలు చూపించకపోతే వాటిని సీజ్ చేస్తున్నారు. అయితే ఓ విచిత్రమైన ఘటన ఇప్పుడు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఓ ఎన్ జి ఓ కు చెందిన ప్రతినిధి.. రోడ్డుపై విధులు నిర్వర్తించే పోలీసులకు, నిస్సహాయులకు కొబ్బరినీళ్లు పంచిపెడుతున్నాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని దీనికి పోలీసులు అభ్యంతరం చెప్పారు.
దీంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పోలీసులకు దాహం తీర్చడం కూడా తప్పేనా?? ఇవెక్కడి రూల్స్ అంటూ ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర వెలుగు చూసింది. అక్కడ లయన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ విజయలక్ష్మి రోడ్లమీద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కొబ్బరినీళ్ళ సీసాలను ఇచ్చారు.
Telangana Elections 2023: నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ రెండో దశ 'విజయభేరి బస్సు యాత్ర'
అదే సమయంలో అటువైపుగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారులు వెళ్తున్నారు. ఇది గమనించిన వారు ఆమె వాహనాన్ని ఆపారు. ఏమి పంచి పెడుతున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి ఆమె కొబ్బరినీళ్లు పంపిణీ చేస్తున్నట్లుగా సమాధానం చెప్పారు. అది విన్న అధికారులు వెంటనే…‘ఎన్నికల టైంలో ఇవన్నీ కుదరవు.. ఇలాంటివి చేయొద్దు’ అంటూ హితవు పలికారు. దీనికి అవాక్కవడం ఆమెవంతయింది.
అంతేకాదు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంచినీళ్లు ఇవ్వాలన్నా.. అన్నదానాలు చేయాలన్నా.. కొబ్బరి నీళ్లు పంచి పెట్టాలన్నా.. కూడా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పారు. దీనికి ఆమె ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. గత 15 సంవత్సరాల నుంచి తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ ఎప్పుడూ చూడలేదు.. అంటూ కాస్త అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు.