Telangana Elections 2023 : ఓటర్ స్లిప్పు అందలేదా? ఓటు ఉందో, లేదో అన్న అనుమానమా? ఇలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు..
మాకే ఓటు వేయమంటూ మీకు ఫోన్ కాల్ వచ్చిందంటే మీకు ఓటు ఉన్నట్లే. ఓటు ఉందో లేదో అన్న కన్ఫ్యూజన్లో ఉన్న అభ్యర్థులకు.. వారి ఫోన్లకు వచ్చే ఈ మెసేజ్లే బండ గుర్తులు.
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఇప్పటికీ చాలామందికి ఓటరు స్లిప్పులు అందలేదు. ఓటరు గుర్తింపు కార్డులు లేవు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన వారికి కూడా ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి.. పోలింగ్ కు ఐదు రోజుల ముందే పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపింది. అయినా ఇప్పటికీ చాలామందికి ఈ రెండిట్లో ఏదీ అందలేదు. దీంతో.. ఓటర్లు అయోమయంలో ఉన్నారు. తమ ఓటు ఉందా? ఎక్కడ ఉంది? ఎందుకు తమకు ఓటర్ స్లిప్పులు, ఓటర్ గుర్తింపు కార్డులు అందలేదు? ఓటును వినియోగించుకోవడం ఎలా? అనే డైలమాలో ఉన్నారు.
ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. . ఆయా నియోజకవర్గాల్లో తమకు ఓటు వేయాలంటూ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్లకి అభ్యర్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయి అంటే.. మీకు ఓటు ఉన్నట్లే. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు అక్కడి ఓటర్ల లిస్టును దగ్గర పెట్టుకున్నారు. ఓటర్లను అభ్యర్థించడం కోసం ఇంటర్ ఆక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత ఆదివారం నుంచి ఈ ఫోన్లు మోగుతూనే ఉన్నాయి.
Telangana Elections 2023 : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయండి.. ఈసీ
ఓటు ఉందో లేదో అన్న కన్ఫ్యూజన్లో ఉన్న అభ్యర్థులకు.. వారి ఫోన్లకు వచ్చే ఈ మెసేజ్లే బండ గుర్తులు. నియోజకవర్గానికి చెందిన పార్టీల అభ్యర్థులు.. నియోజకవర్గంలోని ఓటర్ల ఫోన్ నెంబర్లను మ్యాపింగ్ చేశారు. దీంట్లో భాగంగా అభ్యర్థులను పరిచయం చేసుకుని ఓటు వేసి, గెలిపించాలని రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ ను పంపుతున్నారు. కొంతమందికి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. వారికి డబుల్ ధమాకా, రెండు చోట్ల ఉన్న అభ్యర్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
ఇక మీ ఓటు, పోలింగ్ బూత్ నెంబర్ తెలుసుకోవాలంటే https://electoralsearch.eci.gov.in/ లో మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేస్తే.. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి, ఓటర్ స్లిప్పులు, ఓటరు గుర్తింపు కార్డులు అవసరం లేదు. కేవలం ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తే చాలు.. మీ ఓటర్ స్లిప్పులు వచ్చేస్తాయి.