అప్పుడే బంగారు తెలంగాణ కల నెరవేరుతుంది.. బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఖర్గే విమర్శలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అవినీతి, దుష్పరిపాలన ఆర్థిక అసమానతలను సృష్టించిందని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అవినీతి, దుష్పరిపాలన ఆర్థిక అసమానతలను సృష్టించిందని ఆరోపించారు. ఆ అసమానతల అంతరాన్ని కాంగ్రెస్ పార్టీ హామీలు తగ్గిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు.. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఖర్గే ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. బలహీన, అణగారిన వర్గాలకు భద్రతా వలయాన్ని అందించడంపై తమకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ‘‘అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తేనే మన బంగారు తెలంగాణ కల నెరవేరుతుంది’’ అని ఖర్గే అన్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళలు,యువత, పేదలు, వృద్దులు, రైతులను ఆకర్షించేలా ఆరు గ్యారెంటీలను కూడా ప్రకటించింది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. మేనిఫెస్టోలో అన్ని వర్గాలను ఆకర్షించేలా హామీలను పొందుపరిచేందుకు కసరత్తు చేస్తుంది.
మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు, వామపక్షాల పొత్తులపై చర్చలు జరుపుతోంది. దసరా తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 30వ తేదీన జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.