Asianet News TeluguAsianet News Telugu

telangana election poll : స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చనున్నారా?...

ఐదు నుంచి పదివేల వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న స్వతంత్రులు, రెబల్స్, లేదా ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ.

telangana election poll : Will independents change the candidates of major parties? - bsb
Author
First Published Nov 29, 2023, 11:04 AM IST

హైదరాబాద్ :  తెలంగాణలో ప్రచార పర్వ ముగిసింది. పోలింగ్ కు గంటల సమయమే మిగిలింది. ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులను వణికిస్తుంది స్వతంత్ర అభ్యర్థులు. ఏ పార్టీ ఓట్లు చీలుస్తారో.. ఎవరికి ముప్పు తెచ్చి పెడతారో తెలియక గందరగోళంలో పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా,  ఏదో ఒక పార్టీ గుర్తుతోనో పోటీలో నిలిచిన కొంతమంది ప్రధాన అభ్యర్థులలో ఆందోళనకు కారణం అవుతున్నారు. వీరికి ఓ మోస్తారు ఓట్లే వచ్చినా… ఆ ఓట్లే తమ కొంపముంచబోతాయని చర్చిస్తున్నారు.  అలాంటి పరిస్థితి 15 నియోజకవర్గాల్లో ఉన్నట్లుగా అంచనా.

ఇలాంటి వారిలో ఆయా పార్టీల రెబెల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  అన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి జనసేన కూటమి, బీఎస్పీ  పోటీ చేస్తున్నాయి. అయితే.. ఆయా పార్టీల నుంచి టికెట్లు రాని వారు రెబెల్సుగా పోటీలో ఉన్నారు. వీరిలో కొంతమంది స్వతంత్రులుగా పోటీలోకి దిగగా మరి కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : ఎవరిచ్చినా డబ్బులు తీసుకొండి... కానీ ఓటు మాత్రం వారికే..: రాంగోపాల్ వర్మ

సూర్యాపేటలో వట్టే జానయ్య యాదవ్ బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసి, బిఎస్పి అభ్యర్థిగా చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. మంత్రితో ఉన్న విభేదాల కారణంగా బిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి పోటీలో దిగారు. గతంలో జానయ్య యాదవ్ డీసీఎంఎస్ చైర్మన్ గా పని చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే వట్టే జానయ్య యాదవ్ చీల్చే ఓట్లు  కీలకంగా మారనున్నాయి. ఒకవేళ అధికార పార్టీ ఓట్లు చీలితే బిఆర్ఎస్ మీద ప్రభావం పడుతుంది. అలాకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే కాంగ్రెస్  నష్టపోతుంది.

కొత్తగూడెంలో కూడా ఇలాంటి త్రిముఖ పోటీనే నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చివరి నిమిషంలో బరిలోకి దిగారు. ఇక్కడ గెలుపోవటములతో పాటు మూడో స్థానం ఎవరిది అన్నది కూడా ప్రధానాంశంగా మారింది. 

నల్గొండలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పిల్లి రామరాజు యాదవ్ బరిలో ఉన్నారు. ఆయన బిఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బయటకు వచ్చాడు. రామరాజు యాదవ్ చీల్చే ఓట్లు ఎవరిపై ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి నెలకొంది.

రామగుండం నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చే ఓట్లే రెండు ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

కొల్లాపూర్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బాగా సెన్సేషనల్ గా మారింది.  కారణం ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బర్రెలక్క.  తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తుంది. ఆమె కోసం ప్రచారం చేయడానికి క్యు కడుతున్నారు. ఒకవేళ ఇదంతా ఓటుగా మారి బర్రెలకు ఎక్కువ ఓట్లు వస్తే తమ భవిష్యత్తు ఏంటి అనేది ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన.

మక్తల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వర్కటం జగన్నాథరెడ్డి బిఎస్పీ నుంచి పోటీలోకి దిగారు. నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జగన్నాథరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక బిఎస్పి నుంచి సిర్పూర్ కాగజ్నగర్ లో పోటీలో ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్. ఆయన ప్రధానపార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇక బిఎస్పీ పార్టీ నుంచి పెద్దపల్లిలో పోటీలో ఉన్న దాసరి ఉష కూడా గట్టి పోటీనే ఇస్తున్నట్టుగా సమాచారం.  ఆమె గెలుపోటములను పక్కకు పెడితే.. ఆమెకు వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

పటాన్చెరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు నీలం మధు ముదిరాజ్. ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ముందుగా ఆయనకు టికెట్ ఇచ్చినా.. ఆ తర్వాత బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు నీలం మధు చీల్చే ఓట్లు కూడా ప్రముఖం కానున్నాయి. 

జహీరాబాద్ లో బీఎస్పీ నుంచి జంగం గోపి పోటీలో ఉన్నారు. ఆయన కూడా ఓట్లను భారీగానే చీల్చుతారన్న చర్చ నడుస్తోంది. బీఎస్పీ పార్టీకి అనే అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఓట్లు మిగతా ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలను  తారుమారు చేసేలా ఉన్నాయి.

గద్వాలలో నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజిత్ కుమార్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేశారు. 

అదిలాబాదులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంజీవరెడ్డి స్వతంత్రంగా పోటీలోకి దిగారు. మరోవైపు ప్రధాన పార్టీ కాకపోయినా కాంగ్రెస్తో పొత్తు  ఆశించి బంగపడ్డ సిపిఎం.. 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. సిపిఎం అభ్యర్థులతో భద్రాచలం, ఇబ్రహీంపట్నం, పాలేరు, మిర్యాలగూడ, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వీటిల్లో కూడా కొన్నిచోట్ల గెలుపోటముల మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉంటుందని అంచనా. అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఈ ఓట్ల శాతం కంటే ఎక్కువ ఓట్లే బిఎస్పి లేదా సిపిఎంకు రావచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. ఐదు నుంచి పదివేల వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న స్వతంత్రులు, రెబల్స్, లేదా ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ నడుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios