ఒకరు ఒకలాగా.. మరోకరు మరోలా.. ఇంకొకరు ఇంకోలా.. ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ నేతల మిశ్రమ స్పందన
Telangana Exit Polls Result 2023: ఎన్నికల అనంతరం ఎగ్జిట్ ఫలితాలపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని, ఆ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్ స్పష్టం చేయగా.. ఎగ్జిట్ పోల్స్ తో తమ విజయం ఖాయమైపోయిందని, ఇక సంబరాలు ప్రారంభించండని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కానీ, బీజేపీ నేతలు మాత్రం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Telangana Exit Polls Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ పర్వం ముగిసింది. ఈ ఎన్నిక సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఇక మిగిలింది ఫలితాలు వెలువడటమే. ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందో ? ఏ పార్టీ పరాజయం పాలవుతుందో ? డిసైడ్ కానుంది డిసెంబరు 3 నాడే. అయితే.. ఎన్నికలు పూర్తయినా వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రస్తుతం చర్చనీయంగా మారాయి. అందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ ఎగ్జిట్ ఫలితాలపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, ఎగ్జిట్ పోల్స్ తో తమ విజయం ఖాయమైపోయిందని, ఇక సంబరాలు ప్రారంభించండని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మొత్తానికి ఆ పార్టీలకు ఓ క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది. కానీ, బీజేపీ నేతల కూడా భిన్న స్పందనలు వచ్చాయి. తెలంగాణ బీజేపీకి ముగ్గురు మూల స్థంబాలు.. వారే కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఈటల రాజేందర్. ఈ ముగ్గురూ బీజేపీ నేతలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మెజార్టీ స్థానాలు వస్తాయి.. :కిషన్ రెడ్డి
భారీ మెజారిటీతో తాము గెలుస్తామన్న నమ్మకం తమకకుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు వచ్చాయని కిషన్ రెడ్డి అంటున్నారు. పోలీస్ శాఖ కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసిందని, డబ్బులు పంచుతుంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బులు పంచాయని, కానీ తెలంగాణ యువత బీజేపీకి మద్దతు ఇచ్చిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలపై ఎన్నికల కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ని ఇప్పుడే విశ్వసించలేం .. : బండి సంజయ్
ఈ గెలుపు కార్యకర్తలదే, తన చివరి శ్వాస వరకు బీజేపీ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు బండి సంజయ్. నరేంద్ర మోదీని, బీజేపీని గెలిపించాలన్న కసితో ప్రజలంతా ఏకమయ్యారని, తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ ని ఇప్పుడే విశ్వసించలేమని అన్నారు. హంగ్ వస్తే .. అధిష్టానమే సరైనా నిర్ణయం తీసుకుంటుందనీ, తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదని చెప్పారు బండి.
కాషాయ విజయమే లక్ష్యంగా తమ వ్యాపారాలను, ఉద్యోగాలను, కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి అహర్నిశలు కష్టపడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెన్నంటి నడిచిన యువకులు, జాతీయవాదులు, శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. తమ పవిత్రమైన ఓటుతో కరీంనగర్‌లో కమల వికాసానికి సహకరించిన ప్రతీ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రగతి, సంక్షేమం కోసం జరిగిన శాసనసభ ఎన్నికల అంకం చివరి వరకు తమ అమూల్యమైన సేవలను అందించిన ఎన్నికల నిర్వహణ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, మీడియా సోదర సోదరీమణులకు మనః పూర్వక ధన్యవాదములు తెలిపారు.
25 నుంచి 30 స్థానాలు .. : ఈటెల
ఇక ఈటల రాజేందర్ వివరణ మరోలా ఉంది. తాము 60, 70 స్థానాలు గెలుస్తామని ఎప్పుడూ భావించలేదనీ, బీజేపీకి 25నుంచి 30 స్థానాలు వస్తాయన్నారు. సంకీర్ణ రాజకీయాల్లో ఏమైతదో చూడాలన్నారు. అయితే, బీఆర్ఎస్‌తో మాత్రం కలిసేది లేదని ఈటల తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడిందని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకే ఎక్కువ ఓట్లు వేశారన్నారు. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ తాను విజయం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు కృతజ్ఞతలు ఈటల రాజేందర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయనీ, రాష్ట్రంలో బీజేపీ విజయం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో బీజేపీ గెలుస్తుందని, కేసీఆర్‌ని ఓడించాలనే పట్టుదలతో గజ్వేల్ ప్రజలున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల పోరులో సర్వే సంస్థలకు కూడా అంతుబట్టని ఫలితం వస్తుందన్నారు. గజ్వేల్‌లో ఎక్కువ మెజార్టీతోనో, తక్కువ మెజార్టీతోనో కానీ..తాను గెలుస్తున్నాని ఈటల తెలిపారు.