తెలంగాణ వ్యాప్తంగా త్వరలో భారీగా మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఆదివారం యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన 10వ వార్షిక డాక్టర్స్ క్యాంప్‌లో ఆమె పాల్గొన్నారు.
కోవిడ్ సమయంలో (coronavirus) వైద్యం అందించిన డాక్టర్ల సేవలు చిరస్మరణీయమన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (sabitha indra reddy). ఆదివారం యశోదా ఆసుపత్రి (yashoda hospital) 10వ వార్షిక డాక్టర్స్ క్యాంప్‌లో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాబోతోందని సబిత చెప్పారు. నగరానికి నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. త్వరలో భారీగా మెడికల్ సీట్లు (medical seats) అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.
కష్టం వచ్చినప్పుడే బలంగా నిలబడాలని.. ఏ రంగం ఎంచుకున్నా అందులో నిబద్ధత, మానవత్వంతో నడుచుకోవాలని సబిత సూచించారు. ఒకప్పుడు ఆడపిల్లలను చదవించాలంటే ఆలోచించే పరిస్ధితి వుండేదని.. మోడల్ స్కూల్స్‌లో పరీక్ష పెట్టినప్పుడు చాలా మంది రకరకాల వృత్తులను ఎంచుకునేందుకు ఇంట్రెస్ట్ చూపారని సబిత గుర్తుచేశారు. ఒక పోర్టల్ ద్వారా విద్యార్ధులకు ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ ఇస్తోందన్నారు. కాగా.. వైద్య విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్ధులకు మరింత అవగాహన కల్పించేందుకు గడిచిన పదేళ్లుగా యశోదా ఆసుపత్రి యంగ్ డాక్టర్స్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.
ఇకపోతే.. తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహణ తేదీపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. TS TET 2022 ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్ష రోజే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష ఉన్నందున.. టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండటం వలన అభ్యర్థులు అయోమయానికి గురవతున్నారని.. టెట్ పరీక్ష వాయిదా వేయగలరని మనవి చేస్తున్నట్టుగా చెప్పారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. దానిని పరిశీలించాల్సిందిగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. తాను విషయం వెల్లడించడానికి ముందు సంబంధిత అధికారులతో మాట్లాడానని చెప్పారు. టెట్ పరీక్షలో సుమారు 3.5 లక్ష మంది పాల్గొనున్నారని చెప్పారు. ఇతర పోటీ పరీక్షలతో క్లాష్ కాకుండా పరీక్షా తేదీలను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర అన్ని అంశాలను పరిగణలు తీసుకున్న నేపథ్యంలో.. టెట్ వాయిదా కుదరదని చెప్పారు.
