సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌ను సీజ్ చేసింది తెలంగాణ విద్యా శాఖ. టెన్త్ క్లాస్ తరగతులకు అనుమతి లేకున్నా ఎనిమిది  మంది విద్యార్దులకు  స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌ను సీజ్ చేసింది తెలంగాణ విద్యా శాఖ. స్కూల్‌కి గుర్తింపు లేకపోవడంతో టెన్త్ పరీక్షలకు అనుమతివ్వలేదు విద్యాశాఖ. స్కూల్ యాజమాన్యం నిర్వాకంతో పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారు విద్యార్ధులు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్ధులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం స్పందించింది. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించినందుకు గాను ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌ను సీజ్ చేశారు ఎంఈవో. 

కాగా..ఆక్స్‌ఫర్డ్ స్కూల్ యాజమాన్యం నిర్వాకంతో ఎనిమిది మంది విద్యార్ధులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయలేకపోయారు. టెన్త్ క్లాస్ తరగతులకు అనుమతి లేకున్నా ఎనిమిది మంది విద్యార్దులకు స్కూల్ లో అడ్మిషన్ ఇచ్చారు. అయితే టెన్త్ పరీక్షలు ప్రారంభమైనా ఈ ఎనిమిది మంది విద్యార్ధులకు హల్ టిక్కెట్లు అందలేదు. ఇప్పటికే నాలుగు పరీక్షలు పూర్తైనా కూడా ఎనిమిది మంది విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు రాలేదు. దీంతో బాధిత విద్యార్ధులు ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇప్పటికే టెన్త్ క్లాస్ కు చెందిన తెలుగు , హిందీ, ఇంగ్లీష్, గణితం పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా విద్యార్ధులను స్కూల్ యాజమాన్యం మభ్యపెడుతోందని బాధితుల పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ స్కూల్ లో టెన్త్ క్లాస్ కు అనుమతి లేకున్నా ఎనిమిది మంది విద్యార్ధులను చేర్చుకున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్ధులు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని విద్యాశాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఎనిమిది మంది విద్యార్ధులు ఒక్క ఏడాదిని నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.