Asianet News TeluguAsianet News Telugu

డిఎస్సీ ఆలస్యానికి అదే కారణమా?

  • టెట్ ఫిలితాలొచ్చాయి. డిఎస్సీ ఎప్పుడంటున్న అభ్యర్థులు
  • మరో రెండు, మూడు నెలల ఆలస్యం?
  • పోస్టుల సంఖ్య పెరిగే చాన్ష్ అంటున్న అధికార వర్గాలు
  • రిటైర్ అయిన స్థానాల భర్తీ అంటున్నారు
  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
Telangana dsc recruitment delay for another two or three months

పంచ పాండవులు మంచం కోళ్లలాగ నలుగురే అని మూడు వేళ్లు చూపిన తీరుగా ఉంది తెలంగాణలో టీచర్ ఉద్యోగాల పరిస్థితి. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లవుతున్నా ఇప్పటి వరకు సర్కారు ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్న తరుణంలో మరోవైపు డిఎస్సీ నిర్వహణపై తెలంగాన సర్కారు మీనమేషాలు లెక్కబెడుతున్నది.

ఇక టెట్ పలితలు వచ్చిన వెనువెంటనే డిఎస్సీ ప్రకటిస్తాం అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఆయన మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకునే వాతావరణం మాత్రం కనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటలో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చేసరికి వారం పట్టొచ్చంటున్నారు. దీనికితోడు స్థానికత అంశంపై ఇంకా క్లారిటీ తీసుకోలేదని, అది తేలేవరకు టీచర్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే కొత్త జిల్లాల కారణంగా మేము టీచర్ పోస్టులను భర్తీ చేయలేకపోయామని సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు వాదించింది. మరి కొత్త జిల్లాలు ఏర్పాటై కూడా ఏడాది గడుస్తున్నది. అయినప్పటికీ డిఎస్సీ గురించిన కసర్తత్తు నూరుశాతం జరిగినట్లు లేదు. ఒకవేళ కొత్త జిల్లాల ఏర్పాటే అడ్డంకిగా ఉంటే పాత జిల్లాల ప్రకారమైనా డిఎస్సీ జరపొచ్చు. డిఎస్సీ వెయ్యాలన్న సదుద్దేశమే నీకుంటే ఈ అడ్డంకులు ఒక లెక్క కాదు గదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Telangana dsc recruitment delay for another two or three months

మరో విషయమేమంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొదటి కేబినెట్ లో 15వేల టీచర్ పోస్టుల భర్తీ అన్నారు. తర్వాత ఆ సంఖ్య 12వేలకు, తర్వాత పదివేలకు, తర్వాత 8వేలకు పడిపోయింది. 8వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామంటూ మొన్న టెట్ సమయంలో కూడా కడియం ప్రకటించారు. కానీ పరిస్థితులు చూస్తే మరో రెండు, మూడు నెలల తర్వాతే డిఎస్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.

అధికార వర్గాల సమాచారం బట్టి డిఎస్సీ పోస్టులు మరికొన్ని పెంచే ఆలోచనలో సర్కారు ఉందని, అందుకే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం 8వేలకు తోడు ఇటీవల కాలంలో రిటైర్ అయిన వాటిని కూడా కలుపుకుంటే మరో మూడు నుంచి నాలుగు వేల పోస్టులు కలిసే అవకాశం ఉందంటున్నారు. వాటిని కూడా కలుపుకుని 12 వేల వరకు టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

కానీ నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం అధికార వర్గాల సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే సవాలే లేదంటున్నారు. కేవలం లేట్ చేయడం కోసం ఇదొక సాకు మాత్రమే అన్నది వారి ఆరోపణ. తెలంగాణ సర్కారుకు టీచర్ ఉద్యోగాలియ్యాలన్న చిత్తశుద్ధి మూడేళ్ల కాలంలో ఏనాడూ లేదని వారు అంటున్నారు. ఆ ఖాళీలేవో ఇప్పుడే అయినయా? ఇన్ని రోజుల నుంచి వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి టీచర్ పోస్టులు ఇయ్యాలంటే తెలంగాణ సర్కారుకు మాత్రం అస్సలు మనసు రావడంలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios