తెలంగాణ మహిళల భద్రతా విభాగం స్త్రీల భద్రతకు సంబంధించి ఎన్నో వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, మహిళల సురక్షితమైన భద్రతకు ఎన్నో పరిష్కారాలు అన్వేషిస్తూ, వారి సమస్యలకు ఒక మార్గం చూపెడుతూ ముందుకు సాగుతుంది. తెలంగాణ షీ టీమ్స్  మహిళా భద్రతకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తూ ఇప్పటికే దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం అతివల సంరక్షణే ధ్యేయంగా  అక్టోబర్ 24 2014 లో ఏర్పాటు చేసిన  తెలంగాణ షీ టీమ్స్ కు మొట్ట మొదట హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ హోదాలో స్వాతి లాక్రా దీనికి నేతృత్వం వహిస్తూ అంచెలంచెలుగా దీన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్ర స్థాయిలో స్వాతి లక్రా షీ టీమ్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ షీ టీమ్స్ దిగ్విజయంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది.

ఈ ఆరు సంవత్సరాలలో రాష్ట్రంలో నమోదైన ఎన్నోకీలక  కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ షీ టీమ్స్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ ఘనత సాధించటానికి రాష్ట్ర మహిళా భద్రత విభాగానికి నేతృత్వం వహిస్తున్న అడిషనల్ డిజిపి స్వాతి లక్రా, డిఐజి సుమతి ఎంతగానో కృషి చేశారు.  2014 అక్టోబర్ నుండి 2020 అక్టోబర్ వరకు ఆడవాళ్లకు సంబంధించి మొత్తం 30187 కేసులు తెలంగాణ షీ టీమ్స్ వద్దకు రాగా ఇందులో 3144 ఎఫ్ఐఆర్ లను  నమోదు చేసింది. ఇందులో డయల్ 100 ద్వారా వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ స్త్రీ అయినా 100 ద్వారా తన ఫిర్యాదును ఇస్తే తెలంగాణ షీ టీమ్స్ తక్షణం స్పందిస్తున్నారు.

మిగతా కేసుల్లో దాదాపు ఇరవై వేలకు పైగా కేసులను కౌన్సెలింగ్ లతో మరియు జరిమానాలతో పరిష్కారం దిశగా తెలంగాణ షీ టీమ్స్ చర్యలు తీసుకుంది. తెలంగాణ షీ టీమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండటంతో గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలకు ఈ షీ టీమ్స్ ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఈవ్ టీజింగ్ విషయాల్లో కానీ, గృహ హింస లాంటి కేసుల్లో కానీ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ షీ టీమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. యువతులు కూడా తమకు ఏదైనా ఆపద వస్తే షీ టీమ్స్ ని ఆశ్రయించాలనే అవగాహన వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరంలో అతితక్కువ కేసులు నమోదు కావటం గమనార్హం. 

ఇక మీదట కూడా ఇలాగే ఆడపిల్లల భద్రతకు ప్రాముఖ్యత నిస్తూ ముందుకు సాగుతామని తెలంగాణ షీ టీమ్స్ కి నేతృత్వం వహిస్తున్న వుమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి శ్రీమతి స్వాతి లాక్రా అన్నారు. తెలంగాణ షీ టీమ్స్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతులకు ధైర్యాన్ని ఇస్తున్నాయని, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో భరోసా ఇస్తున్నాయని అన్నారు. షీ టీమ్స్ వద్దకు వెళ్తే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో షీ టీమ్స్ ని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. షీ టీమ్స్ చేస్తున్న కృషి వల్ల మహిళలు తమ భద్రత పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారని అన్నారు. తెలంగాణ షీ టీమ్స్ ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా రాష్ట్ర డిజిపిమహేందర్ రెడ్డి తెలంగాణ షీ టీమ్స్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. మహిళల భద్రత కోసమే షీ టీమ్స్ ఉందని, బతుకమ్మ పండగ సందర్భంగా షీ టీమ్స్ ఆరేళ్ళు పూర్తి చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.