హైదరాబాద్: ఐదు రోజుల పాటు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు.  ఐదు రోజుల పర్యటనను ముగించుకొని ఆదివారం నాడు రోడ్డు మార్గం ద్వారా డీజీపీ హైద్రాబాద్ కు చేరుకొన్నారు.ఈ నెల 2వ తేదీన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రిక్రూట్ మెంట్ కోసం మావోలు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా పోలీసులకు సమాచారం అందింది.

కొమరం భీమ్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ములుగు జిల్లాలో కూడ రెండు మాసాల క్రితం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి. 

ఈ నెల మొదటివారంలో భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకొన్న ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి చెందారు. ఐదు రోజుల పాటు డీజీపీ మహేందర్ రెడ్డి విడతల వారీగా సమావేశాలు నిర్వహించారు. పోలీసు అధికారులతో వ్యక్తిగతంగా ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల నుండి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 2వ తేదీన జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు దళాల పునర్నిర్మాణం జరుగుతోందని పోలీసులు గుర్తించారు.మావోయిస్టు భాస్కర్  డైరీలో కీలక విషయాలను పోలీసులు కనుకొన్నారు.