పోలీసు వ్యవస్థనే కలవరపెడుతున్నాయి

పోలీసు వ్యవస్థనే కలవరపెడుతున్నాయి

ప్రశాంత వాతారణంలో ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఇటు పోలీసు వ్యవస్థను, అటు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలు, ఆదివాసీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన ఆదివారం ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్లలో పర్యటించారు. ఇరు వర్గాల వివాదంపై డీఐజీలు, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.

అంతకుముందు ఆందోళనలో ఉట్నూరు ఎక్స్ రోడ్డులో దహనమైన హోటల్, అక్కడి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హింసా ప్రవృత్తిని పెంచడానికి ప్రయత్నించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రత పరిరక్షణకు విఘాతం కల్గించే వారిని, అల్లర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారిని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించిన వాళ్లను ఉపేక్షించబోమన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది. పరిస్థితులకనుగుణంగా 144 సెక్షన్ ఎత్తివేసే యోచనలో పోలీసులు ఉన్నారు. వదంతులు వ్యాపించకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు అంతర్జాల సేవలను నిలిపివేశారు.

 

రాఠోడ్ జితేందర్ అంత్యక్రియలు పూర్తి

మరోవైపు ఇటీవల జరిగిన ఘర్షణల్లో వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన రాఠోడ్ జితేందర్ అంత్యక్రియలు హస్నాపూర్ లో పూర్తయ్యాయి. జితేందర్కు మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్ నివాళులర్పించారు. రాచకొండ సంయుక్త కమిషనర్ తరుణ్ జోషీ నేతృత్వంలో పోలీసులు హస్నాపూర్ లో పహారా కాస్తున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos