హైదరాబాద్: కొమరం భీమ్ జిల్లాలో బుధవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి మాజీ కార్యదర్శి గణపతి లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం నెలకొనడంతో డీజీపీ టూర్ కు ప్రాధాన్యత నెలకొంది.

గణపతికి ఆరోగ్యం క్షీణించిందని... ఈ కారణంగానే ఆయన పోలీసులకు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారని  వార్తలు వచ్చాయి. ఈ విషయమై పోలీసు  ఉన్నతాధికారుల నుండి సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం.

గణపతితో పాటు మరో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కూడ లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారంలో ుంది. దీంతో ఆయన లొంగిపోవడానికి పోలీసులు సానుకూలంగా సంకేతాలు ఇచ్చారు.

కుటుంబసభ్యులు, బంధువుల ద్వారా లొంగిపోయేందుకు అభ్యంతరం లేదనే సంకేతాలను పోలీసులు ఇచ్చారు.ఈ తరుణంలోనే బుధవారం నాడు డీజీపీ మహేందర్ రెడ్డి కొమరంభీమ్ జిల్లాలో పర్యటించారు. మావోయిస్టు నేత భాస్కర్ డైరీలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించిన్టుగా పోలీసులు గుర్తించారు. ఈ తరుణంలో డీజీపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది జూలై మాసంలో కూడ డీజీపీ మహేందర్ రెడ్డి కొమరం బీమ్ జిల్లాలో పర్యటించారు. ఈ సమయంలో మావోలకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల కాల్పుల నుండి మావోలు తృటిలో తప్పించుకొన్నారు.