సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఇది పనిచేస్తుందన్నారు.
దేశంలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కొందరు కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి కోట్లాది రూపాయాలు కాజేస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చిన డేటా లీక్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోనూ ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియాలు సంయుక్తంగా గురువారం నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ 2023 కాన్ఫరెన్స్‌లో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు. ఇది దేశంలోనే ప్రప్రథమమని అంజనీ కుమార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఇది పనిచేస్తుందని, ఇందులో 500 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని డీజీపీ చెప్పారు.
అలాగే సైబర్ నేరాలను నిరోధించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అలాగే జిల్లాల్లోనూ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందాలను నియమించామని అంజనీ కుమార్ తెలిపారు. 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అనేక దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని.. దాదాపు పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు.
