సీఎం కెసిఆర్ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్: మహిళలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి, గౌరవిస్తోందని... అందులో భాగంగానే సీఎం కెసిఆర్ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు సెలవు ప్రకటించడమే తెలంగాణ ప్రభుత్వానికి మహిళలపై ఎంత గౌరవం ఉందో తెలియజేస్తోందని ఎర్రబెల్లి అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చట్ట సభల్లో మహిళలకు సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ సర్కార్ స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటిల్లో వారికి రిజర్వేషన్లు కల్పించిందన్నారు.
''భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళకు గౌరవనీయమైన స్థానం వుంది. మహిళలు ప్రకృతికి, శక్తికి ప్రతిరూపాలు. అసమాన ప్రతిభావంతులు. మహిళల్ని పూజించే సంస్కారం మనది. అందువల్లే తెలంగాణలో మహిళల భద్రత, రక్షణ, సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకువచ్చారు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి మరణానంతరం వరకు అమ్మ ఒడి, నుండి పరమపద వాహనాల వరకు అనేక పథకాలతో మహిళల అభ్యున్నతికి సీఎం పాటు పడుతున్నారు'' అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
