తెలంగాణ జీరో ఫ్లోరోసిస్ స్టేట్: సూర్యాపేట కలెక్టరేట్ ప్రారంభం తర్వాత కేసీఆర్
తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
సూర్యాపేట: తెలంగాణలో ఆకలి లేదు, పస్తులు ఉండాల్సిన పనే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సూర్యాపేటలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు పాల్గొన్నారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, కూరగాయల మార్కెట్, మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేని విషయా
న్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించుకున్న 23వ కలెక్టరేట్ భవనం సూర్యాపేట అని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు రోజుల్లో మెదక్ లో 24వ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించుకుంటామని ఆయన చెప్పారు. సూర్యాపేట జిల్లా కావడం ఓ చరిత్ర అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో తెలంగాణ రాష్ట్రం పలు అంశాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో కూడ తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలే సరిగా లేవన్నారు. కానీ తెలంగాణలో అసెంబ్లీలకు ధీటుగా జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను నిర్మించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.
జట్టు కట్టి పనిచేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.ఇంకా చాలా అద్బుతాలు జరగాల్సి ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా ఆవిర్భవించిందని కేంద్రమే ప్రకటించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ ఘనత ఇంజనీరింగ్ సిబ్బందికే దక్కనుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
also read:సూర్యాపేటలో కేసీఆర్ టూర్: కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం
గతంలో జలసాధన పేరుతో దుశ్చర్ల సత్యనారాయణ చేసిన పోరాటం గురించి కేసీఆర్ వివరించారు. ఫ్టోరోసిస్ తో నల్గొండ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు ప్రధాని వాజ్ పేయ్ వద్దకు దుశ్చర్ల సత్యనారాయణ తీసుకెళ్లిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇలాంటి నేతల పోరాటం కారణంగానే తెలంగాణ సాధ్యమైందన్నారు.