తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే లక్ష దాటిపోయాయి. బాధితుల్లో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వైద్యుల సలహాలు, మనోధైర్యంతో కరోనాను పూర్తిగా జయించవచ్చన్నారు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌తో సహజీవనం తప్పదన్న ఆయన.. తమ ఇంట్లో ఇప్పటికే ఆరుగురు కరోనా బారినపడ్డారని, కేవలం మనోధైర్యంతోనే వారు వైరస్‌ను జయించారని గుత్తా అన్నారు. మొదట తన కుమారుడు, కోడలికి పాజిటివ్ వచ్చిందని, తర్వాత 15 రోజుల్లో మళ్లీ నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిని సీఎం కేసీఆర్ కొత్తది నిర్మించాలని గతంలోనే ముందుకు వచ్చారని గుత్తా చెప్పారు. కానీ అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వారు మాట మార్చి రెండు నాల్కల ధోరణితో అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

Also Read:హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా: కుటుంబసభ్యులకు నెగిటివ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఓ అద్భుతమేనని సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యంపైనే అధిక నిధులు ఖర్చు చేస్తోందని గుత్తా చెప్పారు. మరోవైపు కొత్త సచివాలయం గురించి స్పందిస్తూ.. పరిపాలనా సౌలభ్యం కోసం సకల సౌకర్యాలతో సెక్రటేరియట్‌ చాలా అవసరమన్నారు.

అందువల్ల కోర్టులలో కేసులు వేసిన వారు విత్ డ్రా చేసుకుని నూతన నిర్మాణానికి సహకరించాలని సుఖేందర్ రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ తరపున 100 అంబులెన్స్‌లు సమకూర్చడం అభినందనీయమని ఛైర్మన్ పేర్కొన్నారు.