తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలపాలని చూస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలపాలని చూస్తుంది. ఇందుకోసం ఆశావాహులు నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. సీనియర్‌ నేతలు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ దరఖాస్తులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల రెండో వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 

అయితే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారు ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన నిబంధనలపై సీనియర్ నేత దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ కూడా రిపోర్టు సిద్దం చేసింది. ఈ నివేదికను రేపు టీపీసీసీకి అందజేయనుంది. 

అయితే దరఖాస్తు సమర్పించే నేతలు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిటీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఓసీ అభ్యర్థుల అయితే నుంచి రూ. 50 వేలుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ. 25 వేలు దరఖాస్తుతో పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికి అభ్యర్థితత్వాన్ని ప్రకటించిన వారితో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామనే ప్రమాణపత్రం తీసుకోవాలనే నిబంధనను కూడా తీసుకురానుంది. అలాగే రాజకీయ జీవితంకు సంబంధించిన ప్రొఫైల్‌ను కూడా పేర్కొనే విధంగా దరఖాస్తులో కాలమ్ ఉంచనున్నారు. అయితే కమిటీ నివేదిక తర్వాత ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది.