టీ కాంగ్రెస్ వార్ రూమ్.. సునీల్ కొనుగోలు ఔట్, సెంథిల్ ఇన్!.. ఆ రచ్చే కారణామా..?
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు గతకొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా ఉన్న సునీల్.. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా తెలస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు గతకొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న.. తెలంగాణ కూడా పార్టీ గెలుపే లక్ష్యంగా సునీల్ కనుగోలు వార్ రూమ్‌ను కూడా నిర్వహించారు. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్ మాదాపూర్‌లోని కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసులు దాడులు చేయడంతో సునీల్ కనుగోలు చిక్కుల్లో పడ్డారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత సునీల్ కనుగోలు.. పూర్తిగా తెలంగాణ మీద దృష్టి కేంద్రీకరించారు. సర్వేలతో పాటు.. పలు సమీకరణాలపై రిపోర్టు కూడా సిద్దం చేసేందుకు రెడీ అయ్యారు.
అయితే ఇప్పుడు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు కారణం.. టీ కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుల వైఖరినే కారణమనే ప్రచారం కూడా సాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌తో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జత కలిస్తే.. ఖమ్మం రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లో పార్టీకి లాభం చేకూరుతుందని సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానానికి ఓ నివేదికను సమర్పించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా వైఎస్సార్‌టీపీని తెలంగాణ విలీనం చేయించి.. షర్మిల తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, మద్దతుదారులను తమవైపుకు తిప్పుకోవాలనే ప్రచారం కూడా సాగుతుంది.
అయితే ఈ పరిణామాలను టీ కాంగ్రెస్‌లోని ఓ వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టినప్పటికీ ఆమెపై ఆంధ్ర ముద్ర ఉందని.. వైఎస్సార్ గతంలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వారు ప్రస్తావిస్తున్నారు. అలాంటి నేపథ్యం ఉన్న షర్మిల కాంగ్రెస్‌లో చేరి తెలంగాణలో యాక్టివ్ అయితే.. అది కేసీఆర్‌కు ఆయుధంగా మారే అవకాశం ఉందని వారు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ నష్టపోయిందని కూడా వారు గుర్తుచేస్తున్నారని సమాచారం. ఇప్పుడు షర్మిల విషయంలో.. కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్దిపొందే అవకాశం ఉందని చెబుతూ.. సునీల్ కనుగోలు రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బేస్ చేసుకుని.. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీనికి కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. పార్టీకి కొంతమేర నష్టం జరిగినట్టుగా ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి చేస్తుంటే.. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సోషల్ మీడియాలో తిప్పికొట్టడంలో సునీల్ కనుగోలు విఫలమయ్యారని రేవంత్‌తో పాటు కొందరు నేతలు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలోనే సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగిందనే ప్రచారం సాగుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో పొసగక పోవడంతో.. సునీల్ కనుగోలు ఇక్కడి బాధ్యతల నుంచి వైదొలిగినట్టుగా సమాచారం. దీంతో పార్టీ అధిష్టానం సునీల్ కనుగోలు సేవలను రాజస్తాన్, మధ్యప్రదేశ్ వాడుకోవాలని నిర్ణయించిందని.. అక్కడ పార్టీ కోసం ఆయన పనిచేయనున్నారని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ ఇప్పటివరకు సునీల్ కనుగోలు చేసిన పనిని మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ కుమార్‌కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో సునీల్ కనుగోలుతో పాటు.. శశికాంత్ సెంథిల్ కూడా కీలక భూమిక పోషించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ఆయన పార్టీ వార్‌రూమ్‌కు ఆయన నేతృత్వం వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా ‘‘40 శాతం కమీషన్’’ ప్రచారం విషయంలో ఆయనదే కీలక భూమిక. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతో పాటు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేసింది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌కు సంబంధించి శశికాంత్ బాధ్యతలు చేపట్టి.. బ్యాగ్రౌండ్‌లో తన పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్వేలు చేయించడం.. కాంగ్రెస్ ఓటు షేర్, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై రిపోర్టులు సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో శశికాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వార్ రూమ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక, శశికాంత్ సెంథిల్ విషయానికి వస్తే.. ఆయన తమిళనాడుకు చెందినవారు. సెంథిల్ కుమార్ 2019 సెప్టెంబర్ 6న తన ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. 2020 నవంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు.. ఎన్నిలక వేళ ప్రజలతో మమేకమయ్యేందుకు సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేయడంలో ప్రావీణ్యం ఉన్న 40 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెంథిల్ కుమార్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.