ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ.. రేవంత్, ఉత్తమ్ మధ్య వాదనలు
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. టికెట్ కేటాయింపులపై వార్ రూంలో రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది.

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా చర్చించింది స్క్రీనింగ్ కమిటీ. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తయినట్లుగా సమాచారం. అయితే టికెట్ కేటాయింపులపై వార్ రూంలో రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీకి , కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేసింది స్క్రీనింగ్ కమిటీ.
నిన్న సాయంత్రం మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదరహిత నేతల జాబితాను కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. పోటీ తీవ్రంగా వున్న చోట్ల అసంతృప్తులు, రెబల్స్ తయారవకుండా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది.