Congress MP Applications: కాంగ్రెస్ బీ ఫామ్ కోసం నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. ఆశావహుల నుంచి అప్లికేషన్ల స్వీకరణకు శనివారం డెడ్ లైన్ కాగా.. చివరి రోజు దాదాపు 166 మంది అప్లై చేసుకున్నారు. దీంతో మొత్తంగా 306 దరఖాస్తులు వచ్చాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Congress MP Applications: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపొందించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేయడానికి ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 306 దరఖాస్తులు వచ్చాయి. శనివారం చివరి రోజు ఏకంగా 166 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం లోక్‌సభ ఎంపీ టికెట్ కోసం శనివారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు.. మల్కాజ్‌గిరి నుంచి నిర్మాత బండ్ల గణేష్, సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ల కోసం మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న కొడుకు పవన్, ఆయన దగ్గర బంధువు చల్లూరి మురళీధర్ భువనగిరి పార్లమెంట్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సీటు కోసం చామల కిరణ్‌ పోటీ పడుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా భువనగిరి సీటు కోసం దరఖాస్తు చేసుకోగా.. సూర్యాపేట అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి కూడా ఈ స్థానం పోటీ పడుతున్నారు. ఇక సికింద్రాబాద్‌ సీటు కోసం డాక్టర్‌ రవీందర్‌ గౌడ్‌, వేణుగోపాల్‌ స్వామి పోటీ పడుతుండగా.., వరంగల్‌ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీ, మహబూబాబాద్‌ నుంచి విజయాబాయ్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 17 సీట్ల కోసం 306 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.